
కాంగ్రెస్‌కు కేఎం ప్రతాప్ రాజీనామా
గాంధీభవన్, ఏఐసీసీ కార్యాలయం, సోనియాకు ఫ్యాక్స్ ద్వారా లేఖ
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం గాంధీభవన్, ఏఐసీసీ కార్యాలయం, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీలకు వేర్వేరుగా ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్‌లో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరిగారు.
తాను కాంగ్రెస్‌లో 40 ఏళ్లుగా క్రియాశీలక స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి మూడు సార్లు డీసీసీ అధ్యక్షుడిగా పని చేశానన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఉండేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారిందని దుయ్యబట్టారు. కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు లభించడం లేదని, కేవలం దళారులకే నిలయంగా మారిందని ఆరోపించారు. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ వల్లే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు.
దిగ్విజయ్ సింగ్ ఒంటెద్దు పోకడలతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని.. పార్టీలో పీసీసీ అధ్యక్షులుగా పని చేసిన కేకే, డి. శ్రీనివాస్‌లు పార్టీని వీడటమే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో తొమ్మిదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాను ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడానన్నారు. అలాంటిది తనకు పార్టీలో గుర్తింపు ఇవ్వకపోవడంతో కొన్ని రోజులుగా తటస్థంగా ఉంటూ వస్తున్నానన్నారు.
2014లో జరిగిన ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని, డీసీసీ అధ్యక్షునిగా కూడా తొలగించారని, తాను చేసిన పొరపాటు ఏమిటని ప్రశ్నించారు. తన రాజకీయ భవిష్యత్ ప్రణాళిక రెండు రోజుల్లో వెల్లడిస్తానని పేర్కొన్నారు. సమావేశంలో కేపీ విశాల్, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ గూటికేనా..!
కేఎం ప్రతాప్ ఆదివారం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. తన రాజకీయ గురువైన డి.శ్రీనివాస్ టీఆర్‌ఎస్‌లో ఉండడంతో ఆ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.