మృతుడు కూచిభొట్ల శ్రీనివాస్
- గోఫండ్ మీ పేజీకి వెల్లువెత్తిన విరాళాలు
- పరిమళించిన మానవత్వం
- మృతుడి భార్యకు అందజేయనున్న రూపకర్తలు
హోస్టన్/న్యూఢిల్లీ/హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్ బార్‌లో జరిగిన కాల్పుల్లో చనిపోయిన తెలుగు వ్యక్తి కూచిబొట్ల శ్రీనివాస్ (32) కుటుంబానికి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు వేలాది మంది మానవతావాదులు ముందుకొచ్చారు. గతంలో శ్రీనివాస్‌తో కలసి పనిచేసిన కవిప్రియ ముతురామలింగం విరాళాల కోసం గోఫండ్‌మీ పేజీని రూపొందించగా కేవలం ఆరు గంటల వ్యవధిలోనే 6,100 మంది స్పందించి 2,27,500 డాలర్లు పంపారు. లక్షా 50 వేల డాలర్ల కోసం ఈ పేజీని ఏర్పాటుచేయగా రెండు లక్షలకు పైగా వచ్చాయి.ఈ సొమ్మును మృతుడి భార్య సునయనకు అందజేయనున్నారు. మృతదేహాన్ని భారత్‌కు పంపడానికి ఆయన కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ డబ్బును ఉపయోగించనున్నట్లు వారు చెప్పారు.
‘శ్రీనివాస్ అత్యంత కరుణాస్వభావం కలిగిన వ్యక్తి. అందరితోనూ ఎంతో ప్రేమగా మెలిగేవాడు. ద్వేషం అనే పదమే అతనికి తెలియదు, ఎంతో తెలివైన వ్యక్తి’ అని సదరు పేజీలో పోస్టు చేశారు. అలాగే అలోక్ చికిత్స కోసం, శ్రీనివాస్ కుటుంబానికి సహాయం కోసం బ్రియాన్ ఫోర్డ్ అనే వ్యక్తి ఫండ్ పేజీని ఏర్పాటు చేయగా 32,660 డాలర్లు వచ్చాయి. ఈ ఇద్దరు యువకులను కాపాడేందుకు ఇయాన్ గ్రిల్లట్ అనే అమెరికన్ యువకుడు ప్రయత్నించి గాయపడడం తెలిసిందే. గ్రిల్లట్ వైద్యసేవలకోసం అతని బంధువులు గోఫండ్ మీ పేజీని ప్రారంభించగా దానికి 99వేల డాలర్లు వచ్చాయి.
తోచిందే చేశా: గ్రిల్లట్
ఆ సమయంలో తనకు తోచిందే చేశానని ప్రాణాలకు తెగించి నిందితుడిని అడ్డుకునేందుకు యత్నించిన అమెరికావాసి ఇయాన్ గ్రిల్లట్ గురువారం మీడియాకు చెప్పాడు. ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్‌లోకి తిరిగివచ్చిన నిందితుడు పూరింటన్ కాల్పులు జరిపేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో గ్రిల్లట్ అతని వెనక కుర్చీలోనే ఉన్నాడు. పూరింటన్ కాల్పులు ప్రారంభించగానే రంగంలోకి దిగిన గ్రిల్లట్ అడ్డుకునేందుకు యత్నించగా ఓ తూటా తగలడంతో గాయపడడం తెలిసిందే. ‘పైకి లేచి వెనుకనుంచి అతనిని లొంగదీసుకునేందుకు యత్నించా. దీంతో అతను నావైపు తిరిగి కాల్పులు జరిపాడు’ అని తెలిపాడు. బాధితుడి ఏ దేశానికి లేదా ఏ జాతికి చెందినవాడనేది అనవసరమని, మనమంతా మనుషులమేనంటూ తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సుష్మ
కాల్పుల ఘటనలో భారతీయుడు చనిపోవడంపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘అమెరికాలోని భారతీయ రాయబారి నవ్‌తేజ్ సర్నాతో మాట్లాడానన్నారు. ‘కాన్సులేట్ కార్యాలయంలో పనిచేసే ఆర్డీ జోషి అక్కడికి చేరుకున్నారు, బాధిత కుటుంబాలకు అండదండగా నిలుస్తారు. జోషితోపాటు మరో అధికారి హర్‌పాల్‌సింగ్ కూడా చేయూతనిస్తారు. వారిరువురు స్థానిక పోలీసులతో వీళ్లిద్దరు సంప్రదింపులు జరుపుతున్నారు. అవసరమైన చర్యలు తీసుకుంటారు’ అని ఆమె ట్వీటర్‌లో పేర్కొన్నారు.
ఖండించిన అమెరికా రాయబార కార్యాలయం
కన్సాస్ జాతి విద్వేష కాల్పులను భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ఘటనపై తమ దేశ దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని అమెరికా ఎంబసీ అధికారి మ్యారీకే ఎల్ కార్లసన్ వెల్లడించారు. కేసుపై వేగంగా దర్యాప్తు జరుపుతుందని అన్నారు. ఈ ఘటనలో తెలుగు వ్యక్తి శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
అలోక్‌ను పరామర్శించిన భారత అధికారులు
అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. గాయపడిన మేడసాని అలోక్ ఇంటికి వెళ్లిన భారత కాన్సులేట్ జనరల్ ఆర్డీ జోషి అతడిని పరామర్శించారు. అలోక్ క్షేమంగా ఉన్నాడని, అతడికి అవసరమైన సహాయం అందిస్తామని హోస్టన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారి అనుమప్ రే హామీయిచ్చారు. శ్రీనివాస్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్‌లో దుండగుడు అడమ్ పూరింటన్ తెలుగు విద్యార్ధులపై కాల్పులు జరపడం పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అప్రమత్తంగా ఉండాలి
అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని మేడసాని అలోక్ తండ్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో శుక్రవారం సాక్షితో మాట్లాడుతూ అమెరికాలో భారతీయులపై ఇటీవల దాడులు పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కన్సాస్ లో దుండగుడు జరిపిన కాల్పుల నుంచి తన కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. ఘటనాస్థలి వద్ద ఉన్న తన కుమారుడు అలోక్ అక్కడి నుంచి పరుగెత్తుకుని వెళ్లిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడని తెలిపారు.ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. బయటకు వెళ్లినప్పుడు ఎవరితోనూ వాదనలు దిగొద్దని అమెరికాలో ఉంటున్న తెలుగువారికి ఆయన సూచించారు.