
కేజ్రీవాల్‌పై బాంబు పేల్చిన మిశ్రా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు కపిల్ మిశ్రా బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లంచం తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ నుంచి రూ.2 కోట్లు లంచం తీసుకోవడం కళ్లారా చూశానని చెప్పారు. ఇలాంటివి రాజకీయాల్లో మామూలేనని తనతో కేజ్రీవాల్ అన్నారని వెల్లడించారు.
కేజ్రీవాల్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా ఈరోజు ఉదయం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిశారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... ఆరోపణలు నిరూపించడానికి తాను సిద్ధమన్నారు. కేజ్రీవాల్ అవినీతి గురించి వెల్లడించడంతోనే తనను మంత్రి పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవన్నారు.
కేజ్రీవాల్ బంధువుకు సంబంధించిన రూ. 50 కోట్ల భూలావాదేవిని సెటిల్ చేసినట్టు తనతో సత్యేంద్రజైన్ చెప్పారని తెలిపారు. తాను పార్టీలోనే ఉంటానని, అవినీతిపై పోరాడతానని మిశ్రా స్పష్టం చేశారు. కేజ్రీవాల్ అవినీతిపై సీబీఐని ఆశ్రయిస్తానని ప్రకటించారు. తాను మంత్రి పదవి చేపట్టిన తర్వాత మాజీ సీఎం షీలా దీక్షిత్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌కు నివేదిక పంపినా ఎటువంటి చర్య తీసుకోలేదని గుర్తు చేశారు.