
కాపుల సమస్యల పరిష్కారానికి కృషి
కాపునాడు నేతలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కాపుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాపునాడు-ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో సోమవారం వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో కలసి పలు అంశాలు తెలియజేయడంతో పాటు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. 2014 ఎన్నికల సమయంలో గెలుపు కోసం కాపులకు టీడీపీ అనేక హామీలిచ్చి ఆ తరువాత వాటి అమలులో నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని వారు ప్రధానంగా జగన్ దృష్టికి తెచ్చారు.
కాపులకు ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం నెరవేర్చేలా తాను ప్రయత్నిస్తానని జగన్ వారికి చెప్పారు. రాష్ట్రంలో జనాభాలో అధికంగా ఉన్న కాపు కులానికి న్యాయం జరిగేలా, తమ సమస్యలపై ప్రభుత్వంలో కదలిక వచ్చేలా కృషి చేయాలని వారు జగన్‌కు విజ్ఞప్తి చేశారు.