భారత్ రాయబారికి పాకిస్థాన్‌లో అవమానం
కరాచీ: పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్ టీసీఏ రాఘవన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కరాచీలో ప్రముఖ క్లబ్ అయిన సింధ్ క్లబ్ చివరినిమిషంలో ఆయనకు, ఆయన భార్యకు ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించింది. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామంతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశం కనిపిస్తున్నది.
కరాచీలోని అత్యంత ప్రాచీన సంస్థ అయిన సింధ్ క్లబ్లో పాకిస్థాన్-ఇండియా సిటిజెన్ ఫ్రెండ్‌షిప్ ఫోరం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఫోరానికి పాకిస్థాన్ స్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా మనవడైన లియాకత్ మర్చంట్ కో చైర్మన్. ఈ కార్యక్రమం భారత్‌కు సంబంధించింది కావడంతో నిర్వాహకులు రాఘవన్‌ను కూడా పిలిచారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన, భార్యతో కలిసి కరాచీ వచ్చారు. అయితే నిర్వాహకుల ఆహ్వానం మేరకు వచ్చిన రాఘవన్‌ను తమ క్లబ్‌లోకి అనుమతించబోమని చివరినిమిషంలో సింధ్ క్లబ్ తెగేసి చెప్పింది. ఇందుకు ఎలాంటి కారణాలూ చెప్పలేదు.
ఈ అకస్మాత్తు పరిణామంతో ఆయన షాక్ గురయ్యారు. పాకిస్థాన్ అధికారుల ఒత్తిడి వల్లో.. లేకపోతే ముంబైలో గజల్ గాయకుడు గులాం అలీ సంగీత కార్యక్రమాన్ని అనుమతించకపోవడం వల్లో ఆ క్లబ్ ఇందుకు తెగించి ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్‌లో భారత్‌పై విద్వేష ప్రచారం జరుగుతున్నదనడానికి ఇది నిదర్శనమని, గులాం అలీ కార్యక్రమాన్ని రద్దు చేయడంపై విద్వేషపూరితంగా అక్కడి చానెళ్లు చర్చలు నిర్వహించాయని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి.
పాక్ రాయబారికీ ఇదే అనుభవం!
భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఇదే తరహా అనుభవం ఎదురైంది. చండీగఢ్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన సిద్ధమవుతుండగా.. తాము ఆయనకు ఆతిథ్యం ఇవ్వలేమని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు చెప్పడంతో ఆయన ప్రయాణాన్ని మానుకున్నారు.