‘తొలిరాత్రి సమాధిలో నాకేమవుతుంది?’
‘సమాధి లోపల ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. భూమి లోపల.. చీకటిలో ఒక్కడే ఉండటం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి’... ఇది తన మరణాన్ని ముందే ఊహిస్తూ ఫిరోజ్ అహ్మద్ రాసిన ఫేస్‌బుక్ పోస్టు. 32 ఏళ్ల ఫిరోజ్ అహ్మద్ దార్ జమ్మూకశ్మీర్ పోలీసుశాఖలో ఎస్సైగా పనిచేస్తున్నాడు. శుక్రవారం కిరాతక లష్కరే తోయిబా ఉగ్రమూక జరిపిన ఉగ్రవాద దాడిలో చనిపోయిన ఆరుగురు పోలీసుల్లో ఫిరోజ్ అహ్మద్ దార్ ఒక్కరు.
ఆయనకు కుటుంబసభ్యులు, పోలీసుశాఖలోని సహోద్యోగులు శుక్రవారం రాత్రి కన్నీటి వీడ్కోలు పలికారు. పుల్వామా జిల్లాలోని డొగ్రిపూర గ్రామంలో ఉన్న తన పూర్వీకుల శ్మశానంలో ఆయనను ఖననం చేశారు. ఈ నేపథ్యంలో 2013 జనవరి 18న అహ్మద్ దార్ రాసిన ఫేస్‌బుక్ పోస్టు ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది. కలిచివేస్తోంది. ‘ మీరు ఎప్పుడైనా ఒక్కక్షణం ఆగి.. తొలిరాత్రి సమాధిలో ఉన్న మీకేం అవుతుందో.. మిమ్మల్ని మీరు అడిగిచూశారా? మీ శరీరాన్ని శుభ్రంచేసి.. మీ సమాధిని సిద్ధం చేసే క్షణాల గురించి ఆలోచించండి. మిమ్మల్ని ప్రజలు మీ సమాధుల వద్దకు మోసుకెళ్లే రోజు గురించి... మీ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యే రోజు గురించి ఆలోచించండి. మిమ్మల్ని మీ సమాధిలో పూడ్చిపెట్టే క్షణం గురించి ఆలోచించండి’ అని అహ్మాద్ దార్ రాశారు.
తొలిరాత్రి సమాధిలో గడిపిన తమ హీరోకు డొగ్రీపూర ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిలో కడతేరిన ఆయనను కడసారి చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన ఇద్దరు కూతుళ్లు ఆరేళ్ల అద్హా, రెండేళ్ల సిమ్రన్ ఒక్కసారిగా తమ ఇంటికి ఇంతజనం ఎందుకొచ్చారో తెలియక అమాయక కన్నుల్లో విస్మయంతో కనిపించారు. ఆయన భార్య ముబీనా అఖ్తర్, వయస్సు ఊడిగిన తల్లిదండ్రులు అహ్మద్ దార్ మృతదేహం వద్ద భోరున విలపించడం చూపరులను కలిచివేసింది.