కశ్మీర్, పాకిస్తాన్ అవిభాజ్యాలు
దేశ విభజన అసంపూర్ణ ఎజెండా
♦ పాక్ ఆర్మీ చీఫ్ అనుచిత వ్యాఖ్యలు
♦ తప్పుడు ఆలోచనలంటూ భారత్ స్పందన
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: అనుచిత వ్యాఖ్యలతో పాక్ మరోసారి భారత్‌తో మాటల యుద్ధానికి తెర తీసింది. ఆ దేశ నేషనల్ డిఫెన్స్ వర్సిటీ విద్యార్థులనుద్దేశించి బుధవారం ప్రసంగిస్తూ.. 1947 నాటి దేశ విభజన అసంపూర్ణ ఎజెండా అని, పాకిస్తాన్, కశ్మీర్‌లు అవిభాజ్యాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ అన్నారు.
ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తేనే భారత్‌తో శాంతి సాధ్యమన్నారు. ‘పాక్, కశ్మీర్‌లు విడదీయడానికి వీల్లేనివి. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనాలంటే కశ్మీర్ ప్రజల ఆకాంక్షల మేరకు కశ్మీర్ సమస్యకు న్యాయమైన పరిష్కారం లభించాలన్నదే మన అభిమతం’ అన్నారు. రహీల్ ప్రసంగ భాగాలను పాక్ ఆర్మీ ప్రతినిధి సలీమ్ బాజ్వా ట్వీట్ చేశారు. ‘దేశాన్ని అస్థిరతపాలు చేసేందుకు మన శత్రువు పరోక్ష యుద్ధం చేస్తున్నాడు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు’ అని ఆరోపించారు.
రహీల్ వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. ‘వాళ్లు అదే తప్పుడు భావనలో ఉంటున్నారు. తప్పుడు ఆలోచనల వల్ల వాస్తవ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు’ అని విదేశాంగ సహాయ మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించైనా సరే.. పాక్‌కు గుణపాఠం నేర్పించాలని శివసేన డిమాండ్ చేసింది. రహీల్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని కాంగ్రెస్ అంది.ఈ పరస్పర విమర్శల నేపథ్యంలో.. భారత్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు.
భారత్‌లో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఇస్లామాబాద్‌లో నవాజ్‌ను కలిసి భారత్, పాక్ సంబంధాల్లోని ఇటీవలి పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా.. పరస్పర విశ్వాసం, సార్వభౌమ సమానత్వం ప్రాతిపదికగా భారత్‌తో సత్సంబంధాలను నెలకొల్పుకోవాలన్నదే తమ అభిమతమని షరీఫ్ అన్నారు. కాగా, పాక్‌కు అమెరికా భారీగా ఆయుధాలను విక్రయించడంపై భారత రక్షణ మంత్రి పారికర్ ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా రక్షణ మంత్రి కార్టర్‌తో చర్చలకు ముందు ఆయన విలేకర్లతో మాట్లాడారు. మరోపక్క.. కశ్మీర్‌లోని టెలికం టవర్లపై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో పరిస్థితి సమీక్షించేందుకు అధికారులను కేంద్రం అక్కడికి పంపింది. ధ్వంసం చేసిన వెయ్యి టవర్లులో 600 టవర్లను టెలికం కంపెనీల సాయంతో పునరుద్ధరించారు.
పాక్ జెండా ఎగరేస్తే తప్పేంటి?: ఎన్సీ
కశ్మీర్లో పాకిస్తాన్ జెండా ఎగరేస్తే తప్పేంటని, దీనిపై కేంద్రం ఎందుకు కలవరపడుతోందని నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) సీనియర్ నేత ముస్తఫా కమాల్ ప్రశ్నించారు. పొరుగుదేశం జెండాను భారత్ గౌరవించాలని సుద్దులు చెప్పారు. ఎన్సీ అధినేత ఫారూఖ్ అబ్దుల్లాకు ముస్తఫా సోదరుడు. ఇటీవల పాక్ జెండాలను కశ్మీర్‌లో వేర్పాటువాదులు ఎగరేయడంపై ముస్తఫా పై వ్యాఖ్యలు చేశారు. దీనిపై దుమారం రేగడంతో.. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, వాటిని తమ పార్టీ ఖండిస్తోందని ఎన్సీ చీఫ్ ఒమర్ అబ్దుల్లా చెప్పారు.