
ఏడాదిలో సంక్షేమ పథకాలెన్నో..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ భవన్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఉత్సవాల్లో టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు డా.వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్, తెలంగాణ భవన్ సిబ్బంది, స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ తొలి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని తెలంగాణ భవన్ విద్యుత్ దీపాలతో కొత్త వెలుగులు సంతరించుకుంది.
తెలంగాణ భవన్ నిర్మించండి...
ఢిల్లీలో పూర్తిస్థాయిలో తెలంగాణ భవన్‌ను నిర్మించాలని డిప్యూటీ సీఎంకు తెలంగాణ విద్యావంతుల వేదిక విజ్ఞప్తి చేసింది. వేదిక ఢిల్లీ యూనిట్ కన్వీనర్ శ్రవణ్‌కుమార్ నేతృత్వంలో బృందం పలు ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాలను డిప్యూటీ సీఎం, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలకు అందజేసింది. తెలంగాణ భవన్‌లో పోస్టుల భర్తీ, తెలంగాణ ఆహార, హ్యాండ్లూమ్ ఉత్పత్తుల స్టాళ్ల ఏర్పాటు, తెలంగాణ భవన్ పరిసరాల్లో నర్సింహస్వామి ఆలయ ఏర్పాటు తదితర ప్రతిపాదనలను వినతిపత్రంలో పేర్కొన్నారు.