దశాబ్ది వేడుకల ముగింపు సందర్భంగా ట్యాంక్ బండ్‌పై బాణసంచా, లేజర్ షో
దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై వేడుకలు
హాజరైన గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రముఖులు
వేదికపై అందెశ్రీ, కీరవాణిలకు సన్మానం
అలరించిన కళాకారుల కార్నివాల్..
‘జయ జయహే’ పూర్తి గీతం నేపథ్యంగా సాగిన ఫ్లాగ్ వాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ముగింపుగా ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక మహోత్సవం కనుల పండువగా జరిగింది. వైవిధ్యభరితమైన తెలంగాణ సంస్కృతిని సమున్నతంగా చాటే కళాకారుల ప్రదర్శనలు.. ‘జయజయహే తెలంగాణ’పూర్తి గీతం నేపథ్యంగా ఐదు వేల మందితో జరిగిన ఫ్లాగ్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, తెలంగాణ ఉద్యమకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్, సీఎం సందర్శించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
తెలంగాణ అస్తిత్వాన్ని, వివిధ జిల్లాల వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తూ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులు కార్నివాల్ నిర్వహించారు. మహిళా కళాకారుల డప్పుదరువు, ఒగ్గుడోలు ప్రదర్శన, బోనాలు, పోతురాజులు, ఘట విన్యాసం, బైండ్ల జమిడికలు, చిందు యక్షగానం, బతుకమ్మలు, గుస్సాడీ, థింసా, శివసత్తులు, మాధురి, లంబాడా నృత్య ప్రదర్శనలతో కార్నివాల్ సాగింది. ప్రముఖ నృత్యకారిణి అలేఖ్య పుంజుల బృందం ప్రదర్శించిన తెలంగాణ నృత్య నీరాజనం ఆకట్టుకుంది.
ఉద్వేగ భరితం ‘జయ జయహే’గీతం
13.5 నిమిషాల నిడివితో ఉన్న ‘జయ జయహే తెలంగాణ’పూర్తి గీతాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు. దీనిని వినిపిస్తున్న సమయంలో 5 వేల మంది పోలీసు శిక్షణ అభ్యర్థులు జాతీయ జెండాలతో ‘ఫ్లాగ్ వాక్’చేశారు. అప్పటికే వర్షం మొదలైనా కవాతు విజయవంతంగా సాగింది. ఈ సమయంలో వేదికపై గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిలను సీఎం సన్మానించారు.
ఆటంకం కలిగించిన వర్షం
ట్యాంక్‌బండ్‌పై వేడుకలు మొదలైన కొంతసేపటికే వర్షం మొదలైంది. దీంతో వేడుకలకు వచ్చిన జనం ఇబ్బందిపడ్డారు. ఫ్లాగ్‌వాక్ సమయానికి వాన తీవ్రత మరింత పెరగడంతో ఇతర కార్యక్రమాలను హడావుడిగా ముగించాల్సి వచ్చింది. చివరిలో పది నిమిషాల పాటు బాణాసంచా పేల్చేందుకు ఏర్పాట్లు చేసినా.. వాన కారణంగా కొన్ని నిమిషాలకే పరిమితం చేశారు. మరోవైపు తమకు ఆహ్వనం ఉన్నప్పటికీ వేడుకల్లో పాల్గొనేందుకు పోలీసులు అనుమతించడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. పాస్‌లు లేనివారిని అనుమతించలేదని పోలీసులు తెలిపారు.
ఢిల్లీలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఆదివారం అమర వీరుల స్తూపానికి, అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ.. పదేళ్లుగా తెలంగాణ ఎన్నో సవా ళ్లు, చిక్కుముడులు ఎదురైనా సమష్టిగా ఎదుర్కొని అనేక రంగాలలో ప్రగతి పథంలో నిలిచిందని తెలిపారు. వేడుకల్లో తెలంగాణ భవన్ మాజీ రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment