
నేడు ఫ్లోర్ లీడర్ల భేటీకి కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందేలా కార్యాచరణ మొదలుపెట్టిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మంగళవారం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన జరగనున్న పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశానికి స్వయంగా హాజరుకావాలని నిర్ణయించారు. ఆయన ఈ భేటీలో పాల్గొంటుం డటం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి! మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ హాల్లో జరిగే ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీలు వివేక్, మంద జగన్నాథంలతో కలసి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. బిల్లును సభలో ప్రవేశపెట్టే తేదీలపై స్పీకర్ నుంచి ఆయన స్పష్టత కోరతారని తెలుస్తోంది. బిల్లును సమర్థిస్తున్న పలు పార్టీల మద్దతు కోరుతూనే, దీనిపై స్పష్టత ఇచ్చేలా స్పీకర్‌పై, కేంద్రంపై ఆయా పార్టీల ద్వారా ఒత్తిడి పెంచాలన్నది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న మొత్తం 39 బిల్లుల్లో తెలంగాణ బిల్లుకు రెండో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ దృష్ట్యా ఫిబ్రవరి పదో తేదీకి ముందే బిల్లును ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కోరతారని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
బీజేపీ వెనక్కెళ్తే వారికే నష్టం: అజిత్‌సింగ్
బిల్లుకు మద్దతు కోరుతూ అన్ని జాతీయ పార్టీల అధ్యక్షులను కలుస్తున్న కేసీఆర్ సోమవారం తన బృందంతో కలసి ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు అజిత్‌సింగ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిలతో విడివిడిగా భేటీ అయ్యారు. బిల్లుకు సంపూర్ణ మద్దతు కోరారు. అందుకు వారి నుంచి పూర్తి సానుకూలత లభించింది. భేటీ అనంతరం కేసీఆర్‌తో కలసి అజిత్‌సింగ్ విలేకరులతో మాట్లాడారు. ఏడేళ్ల కిందటే వరంగల్‌లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి హోదాలో పాల్గొని తెలంగాణకు మద్దతు తెలిపానని గుర్తు చేశారు. ‘‘ఎన్నో క్లిష్ట పరిస్థితులను దాటుకుని పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు అనుకూల వాతావరణం ఉంది. మా నుంచీ సంపూర్ణ మద్దతుంటుంది. తెలంగాణకు మద్దతిస్తామన్న హామీ నుంచి బీజేపీ వెనక్కు వెళ్తే ఎన్నికల వేళ వారికినష్టమే’’ అన్నారు. తెలంగాణ బిల్లును బలపరుస్తున్నామని, దానికి తమ మద్దతుందని సురవరం చెప్పారు. ‘‘మెజార్టీ పార్టీలు మద్దతు తెలిపినందున బిల్లు సజావుగా ఆమోదం పొం దేలా చూడాలని మేం కేంద్రాన్ని కోరాం. కొందరు బిల్లును అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలను అడ్డుకునే బాధ్యతను కాంగ్రెస్, బీజేపీలే తీసుకోవాలి. బిల్లు అసెంబ్లీలో తిరస్కరణకు గురైందని చెబుతున్నా, ఆ తీర్మానానికి ఎలాంటి విలువా లేదు. ఆర్టికల్ 3 ప్రకారం మాత్రమే బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సీమాంధ్ర ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరిగేలా మా పార్టీ కృషి చేస్తుంది’’ అని తెలిపారు.
బీజేపీ వెనక్కు పోతుందనుకోను: కేసీఆర్
తెలంగాణకు మద్దతుపై బీజేపీ వెనక్కు పోతుందని అనుకోనని కేసీఆర్ అన్నారు. ఈ మేరకు వస్తున్నవన్నీ మీడియా కథనాలేనని, మంచి కార్యం జరుగుతున్న తరుణంలో అడ్డంకులు సృష్టించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతాయని అన్నారు. ‘‘తెలంగాణకు మద్దతిస్తామని ఈ రోజు కమల్‌నాథ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ లోక్‌సభలో విపక్ష నేత, బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్ తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు బ్రహ్మాండంగా ఆమోదం పొందుతుంది. దీనిపై కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. తెలంగాణకు మొదటి నుంచీ మద్దతుగా నిలిచినందుకు అజిత్‌సింగ్, సురవరంలకు ధన్యవాదాలు’’ అన్నారు.
కేసీఆర్‌కు రాజ్‌నాథ్ ముఖంచాటు!
తెలంగాణ అంశంపై ఒక్కో జాతీయ పార్టీ మద్దతు కూడగడుతున్న కేసీఆర్‌కు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అపాయింట్‌మెంట్ మాత్రం దక్కకపోవడం ఆ పార్టీతో పాటు ఢిల్లీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల క్రితమే రాజ్‌నాథ్‌ను కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరారు. సోమవారం మధ్యాహ్నం తరవాత ఏదొక సమయంలో ఇస్తామని కబురు పంపారు. కానీ సోమవారం రాజ్‌నాథ్ ఢిల్లీలోనే అందుబాటులో ఉండి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇచ్చినా కేసీఆర్‌కు మాత్రం తిరస్కరించారు. పైగా మంగళవారం కూడా రాజ్‌నాథ్ అందుబాటులో ఉండరంటూ ఆయన కార్యాలయం టీఆర్‌ఎస్ నేతలకు సమాచారమిచ్చింది. దీనిపై వారు ఒకింత అసహనంతో ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుపైనే వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విభజనకు అడ్డుగా నిలబడి, టీడీపీతో మైత్రికి ప్రయత్నిస్తున్న వెంకయ్యే పార్టీ అధ్యక్షుడిని తప్పుదారి పట్టిస్తున్నారని బహిరంగంగా విమర్శిస్తున్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా సోమవారం రాజ్‌నాథ్‌తో భేటీకి ప్రయత్నించి విఫలమయ్యారు. మంగళవారం వారి ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయో చూడాలి.