హజారే చనిపోవాలని కేజ్రీవాల్ కోరుకున్నారా?
న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హజారే చేపట్టిన ఆమరణ దీక్ష ఎక్కువ రోజులు కొనసాగి ఆయన చనిపోతే తన రాజకీయ ప్రయోజనాలు నెరవేరతాయని కేజ్రీవాల్ ఆశించారన్నారు. ఉజ్జయిని జిల్లాలో ఆర్యసమాజ్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అగ్నివేశ్ ఈ ఆరోపణలు చేశారు.
2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష సందర్భంగా హజారే చనిపోతే బావుండని కేజ్రీవాల్ కోరుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. హజారే ఆమరణ నిరాహారదీక్షను నిరవధిక నిరాహార దీక్షగా మార్చాలనే పార్టీ ప్రతిపాదనకు కేజ్రీవాల్ గట్టిగా అడ్డు తగిలారనీ, పైగా ఉద్యమం ఇపుడు త్యాగాలను కోరుతోందంటూ వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శనమన్నారు. హజారే చనిపో్తే తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చనే కేజ్రీవాల్ దురుద్దేశం స్పష్టమవుతోందన్నారు.
అయితే అప్పటి ప్రభుత్వం ఆయన డిమాండ్లకు అంగీకరించి, హజారే ఉద్యమాన్ని విరమింపజేసింది కానీ, లేకపోతే ఇంకో పది రోజులు హాజారే దీక్ష కొనసాగాలని కేజ్రీవాల్ కోరుకున్నారని స్వామి అగ్నివేశ్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలిపై తాను ఆనాడే యోగేంద్ర యాదవ్ని హెచ్చరించానన్నారు. ఢిల్లీలో మెజార్జీ సాధించి ప్రభుత్వాన్ని స్థాపించిన అనతికాలంలోనే ఆప్లో వివాదాలు రగులుకున్నాయి. అసంతృప్త నేతలమధ్య సయోధ్యకు చేసిన ప్రయత్నాలు ఫలించలేద. చివరకు ఆ నేతల బహిష్కరణకు దారి తీసిన సంగతి తెలిసిందే.