కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షునిగా యార్లగడ్డ
సాక్షి, న్యూఢిల్లీ: కెనడాలో భారత సాంస్కృతిక రాయబారిగా పనిచేస్తున్న ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆగ్రాలోని కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి తొలివారంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించి మూడేళ్లపాటు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు.
హిందీ భాషాభివృద్ధి, హిందీ భాష బోధన నాణ్యత మెరుగుదలకు అవసరమైన చర్యలు, హిందీ ఉపాధ్యాయులకు శిక్షణ, హిందీ భాషపై పరిశోధనలతోపాటు పలు భారతీయ భాషలకు సంబంధించిన అనేక అధ్యయనాలను సంస్థ నిర్వహిస్తోంది. 1960లో తెలుగువారైన పద్మభూషణ్ డాక్టర్ మోటూరు సత్యనారాయణ ప్రారంభించిన ఈ సంస్థకు ఉపాధ్యక్షునిగా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి యార్లగడ్డ కావడం విశేషం. ఈ సందర్భంగా యార్లగడ్డ.. ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లంరాజులకు కృతజ్ఞతలు తెలియజేశారు.