‘కృష్ణా-గోదావరి బేసిన్’ వాటాతో కోటి ఎకరాలకు నీరు
తెలంగాణలో రైతు ఆత్మహత్యలే ఉండవు : మంత్రి పోచారం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా-గోదావరి బేసిన్‌లో తెలంగాణకు కేటాయించిన నీటిని ఉపయోగించుకుంటే కోటి ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడిం చారు. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం, తెలంగాణ విశ్రాంత వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘తెలంగాణలో వ్యవసాయాభివృద్ధి’పై తయారుచేసిన ప్రతిపాదనలను మంత్రి ఆదివారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రెండు నదుల నుంచి లక్ష క్యూసెక్కుల నీరు కిందికి పోతుందనీ, ఈ నీటిని సద్వినియో గం చేసుకుంటే తెలంగాణలో రైతు ఆత్మహత్యలే ఉం డవన్నారు. గతంలో ప్రాణహిత- చేవెళ్ల కోసం రూ. 9.500 కోట్లు ఖర్చుచేశారని.. కాని ప్రాజెక్టు నిర్మించకుండా కాల్వలు మాత్రమే తవ్వడంతో నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
గోదావరిపై మహారాష్ట్రలో 187 ప్రాజెక్టులు నిర్మిం చారని, దీంతో శ్రీరాంసాగర్ కు నీరెలా వస్తుందని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత-ఇంద్రావతిపై కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే.. వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు 365 రోజులూ నీటిని అందించవచ్చని, రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
త్వరలో మరిన్ని ఏఈవో పోస్టుల భర్తీ
త్వరలో మరిన్ని వ్యవసాయ, ఉద్యాన విస్తరణాధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారుచేస్తున్నామన్నారు. ప్రస్తుతం వ్యవసాయశాఖలో 1,112 వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పోస్టులు ఉన్నాయన్నారు. వీటి సంఖ్య పెంచే విషయమై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. 2,500 హెక్టార్లకు ఒక ఏఈవో చొప్పున నియమిస్తే 1,523 పోస్టులు వస్తాయన్నారు.
2 వేల హెక్టార్లకు ఒక ఏఈవో చొప్పునైతే 1,921 పోస్టులు, వెయ్యి హెక్టార్లకు ఒక ఏఈవో చొప్పునైతే 3,842 పోస్టులు వస్తాయన్నారు. వీటిలో ఏ ప్రతిపాదన ప్రకారం పోస్టులను మంజూరు చేయాలన్న దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే వ్యవసాయ కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితర అధ్యాపక పోస్టులు 637 ఉన్నాయన్నారు.
కొత్తగా 4 పాలిటెక్నిక్ కాలేజీలు, పాలెంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుతో మరో 251 పోస్టులు ప్రతిపాదిస్తున్నామన్నారు. వ్యవసాయ అధికారులకు పదోన్నతులు, వాహన సౌకర్యం కల్పించి, కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి బి.శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.