ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్
ఖమ్మం మయూరిసెంటర్ : ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య, దళితులకు భూపంపిణీ, గృహ నిర్మాణం, రుణమాఫీ, నియామకాలు, నీళ్లు ఇలా ఏ ఒక్క హామీ నెరవేర్చే దిశగా పాలన సాగడం లేదన్నారు. ప్రజలను దూషించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. కార్మిక సంఘాలను దిక్కుమాలిన సంఘాలు అన్న కేసీఆర్‌కు సకల జనుల సమ్మె సందర్భంలో సంఘాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మంత్రులు అహంకార ధోరణితో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించకపోగా.. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సచ్చినోళ్లు లేచి వస్తారా అని అర్థరహితంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదన్నారు. కార్మిక సంఘాలను, ఎర్రజెండాలను విస్మరిస్తే ఎర్రజెండాల దెబ్బను కేసీఆర్ రుచి చూడక తప్పదన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, కార్యదర్శివర్గ సభ్యులు పోటు ప్రసాద్, జమ్ముల జితేందర్‌రెడ్డి, సింగు నర్సింహారావు, నగర కార్యదర్శి ఎస్‌కె.జానిమియా తదితరులు పాల్గొన్నారు.