ఐదేళ్ల తర్వాత బాధ్యత మాదే
రైతు ఆత్మహత్యలపై మంత్రి కేటీఆర్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గత 60 ఏళ్ల పాలనలోనే తెలంగాణలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతు ఆత్మహత్యల విషయంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని.. ఐదేళ్ల తర్వాత రాష్ర్టంలో ఎక్కడైనా రైతుల ఆత్మహత్యలు జరిగితే.. ఆ బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని.. దానికి జవాబుదారీగా ఉంటామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు, మన సీఎం కేసీఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని.. చంద్రబాబు బిల్డప్‌లు ఎక్కువ.. పనితక్కువని విమర్శించారు. ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో నివాసగృహాలకు రూ.578 కోట్ల అంచనా వ్యయంతో మంచినీటిని అందించే వాటర్ గ్రిడ్ పనులకు ఆదివారం ఆయన కూసుమంచి మండలం జీళ్లచెరువులో శంకుస్థాపన చేశారు.
సాగునీరందడం లేదు: ఎంపీ పొంగులేటి
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలానికి చెంతనే పాలేరు రిజర్వాయర్ ఉన్నా సాగునీరు అందడంలేదని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పదేళ్లలో కేవలం రెండేళ్లే ఈ ప్రాంత రైతులు పంటలు సాగు చేసుకున్నారన్నారు.
ఈ మండలానికి ప్రభుత్వం వెంటనే సాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు కృష్ణానది జలాలు అందకపోతే గోదావరితో నీటిని ఎత్తిపోసి ఈ ఆయకట్టుకు ప్రభుత్వం నీళ్లు అందించాలన్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించి ఎక్స్‌గ్రేషియా పెంపుపై నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.