♦ టీడీపీ నేత కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడానికి రంగం సిద్ధం
♦ సింగిల్ టెండర్.. అయినా రద్దు చేయని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్ : అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టపెట్టడానికి టీడీపీ ప్రభుత్వం నిబంధలకు పాతరేస్తోంది. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో నిబంధనలను పక్కనబెట్టి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది. టెండర్లలో ఒకే కంపెనీ పాల్గొంటే.. ఆ టెండర్ రద్దు చేసి మళ్లీ పిలవాలనే నిబంధనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు పలమనేరు నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో 4.5 లక్షల మందికి తాగునీరు, 6,300 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు రూ. 413 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచిన విషయం విదితమే. ప్రత్యేకంగా రూపొందించిన (టైలర్‌మేడ్) నిబంధనలతో టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్స్‌లో టీడీపీ నేత ఆర్కే ఇన్‌ఫ్రాను ప్రభుత్వ పెద్దలు గట్టెక్కించారు. ఆర్కే ఇన్‌ఫ్రాతో పాటు గాయత్రి సంస్థ కూడా టెండర్లు దాఖలు చేసింది.
సాంకేతిక బిడ్స్ దశలోనే గాయత్రికి అర్హత లేదని తేల్చారు. మొత్తం పని విలువలో సగం.. అంటే రూ. 207 కోట్ల విలువైన కాల్వ తవ్వకం పనులను ఏడాదిలో పూర్తి చేసి ఉండాలనే టైలర్‌మేడ్ నిబంధన పెట్టి, పెద్ద కంపెనీలు పోటీకి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ నిబంధనను సాకుగా చూపించి గాయత్రికి అర్హత లేదని తేల్చారు. ఇక ఆర్కే ఇన్‌ఫ్రా ఒక్కటే రంగంలో నిలిచింది. రూ. 413 కోట్ల పనికి 4 శాతం ఎక్సెస్‌తో రూ. 430.29 కోట్లకు టెండర్ దాఖలు చేసిన ఆర్కే ఇన్‌ఫ్రాకు కాంట్రాక్టు కట్టబెట్టవచ్చంటూ తెలుగుగంగ సీఈ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్ కమిటీ కాంట్రాక్టు కట్టబెట్టే విషయంలో తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే తెలుగుగంగ సీఈ సెలవులో ఉండటంతో హైపవర్ కమిటీ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. సింగిల్ టెండర్ నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేత కంపెనీకి పనులు కట్టబెట్టడానికి రంగం సిద్ధమయినట్లు నీటిపారుదల శాఖ వర్గాల ద్వారా తెలిసింది.
‘కుప్పం కెనాల్’ నిబంధనలకు నీళ్లు
Published Tue, Sep 29 2015 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM
Advertisement
Advertisement