అక్కడ పెళ్లికాని ప్రసాదులు లక్షల్లో..
గుజరాత్‌లో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆ రాష్ట్రంలో ముఖ్యంగా సౌరాష్ట్ర ప్రాంతంలో గ్రామీణులను, వ్యవసాయదారులను పెళ్లి చేసుకోవడానికి మహిళలు నిరాకరిస్తున్నారు. గుజరాత్‌లో 25-34 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారిలో ప్రతి ఇద్దరు అవివాహితులకు, ఏడుగురు పెళ్లికాని యువకులు ఉన్నారు. 25 ఏళ్లకు పైబడిన వారిలో మొత్తం 17.75 లక్షల మంది పెళ్లికాని యువతీయువకులు ఉన్నారు.
మగపిల్లలతో పోలిస్తే బాలికల సంఖ్య తగ్గిపోతుండటమే ఈ సమస్యకు కారణం. 1981లో ప్రతి 1000 మంది బాలురుకు 947 మంది బాలికలు ఉండేవారు. అదే 2011 నాటికి బాలికల నిష్పత్తి 886కి తగ్గింది. ఇక గుజరాత్‌లో పోర్‌బందర్ ప్రాంతంలోనే పెళ్లికాని యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది. చాలా కులాల్లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఉన్నత విద్యావంతులుకావడంతో, చదువులేని యువకులను పెళ్లిచేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. గత దశాబ్దకాలంలో లేట్ మ్యారేజీలు ఎక్కువగా జరుగుతున్నాయి.
పోరబందర్ ప్రాంతానికి చెందిన రమేష్ పటేల్‌కు 34 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లికాలేదు. ఓ పెళ్లి సంబంధం చూస్తే పోర్‌బందర్‌కు మారాలని పెళ్లికూతురు తరఫువారు షరతు పెట్టారని, తాను తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకుని కావడంతో వ్యవసాయంతో పాటు తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత తనపై ఉందని, ఊరు విడిచి వెళ్లేందుకు నిరాకరించడంతో తనను వివాహం చేసుకునేందుకు ఆ అమ్మాయి నిరాకరించిందని రమేష్ చెప్పాడు. గుజరాత్‌లో రమేష్ లాంటి పెళ్లికాని యువకులు లక్షలాదిమంది ఉన్నారు.