నోట్లరద్దుపై లాలూ వార్నింగ్
పట్నా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన నోట్లరద్దుపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. 1970లో ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బలవంతపు కుటంబనియంత్రణ (నశ్బందీ) పథకానికి పట్టినగతే నోట్లరద్దు నిర్ణయానికి పడుతుందని ఆయన పేర్కొన్నారు.
నోట్లరద్దు విఫలమైందని, ప్రధాని మోదీ చెప్పిన 50 రోజుల గడువులోగా ప్రజల కష్టాలు తీర్చకపోతే.. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా భారీ ఆందోళన చెపడతామని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. బిహార్‌లో అధికార భాగస్వామి జేడీయూతోపాటు ఇతర భావజాల సారూప్యమున్న పార్టీలతో కలిసి ఈ ఆందోళనను ముమ్మరం చేస్తామని ఆయన అన్నారు. ఆర్జేడీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. లాలూ పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడుతుండగా.. ఆయన మిత్రపక్షమైన జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధాని మోదీకి అండగా నిలిచిన సంగతి తెలిసిందే.