భూమిని దాటేసిన ‘పుర్రె’!
ప్యూర్టోరికో: అంతరిక్షంలో అత్యంత వేగంగా దూసుకెళుతున్న ‘2015టీబీ145’ అనే తోకచుక్క భూమికి అత్యంత సమీపం నుంచి దాటి వెళ్లింది. భూమిని ఢీకొని ఉంటే జీవజాలానికి తీవ్రస్థాయిలో నష్టం కలిగించగలిగిన ఈ తోకచుక్క... ఎలాంటి ప్రమాదం కలిగించకుండానే దూసుకెళ్లింది. ‘పుర్రె’ ఆకృతిలో ఉన్న ఈ తోకచుక్కను నెల రోజుల కిందటే అమెరికాలోని ప్లానెటరీ సైన్స్ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తున్న భారత శాస్త్రవేత్త విష్ణురెడ్డి ఆధ్వర్యంలోని బృందం గుర్తించింది. దీనిని ప్యూర్టోరికోలోని అరెసిబో అబ్జర్వేటరీ సహాయంతో చిత్రీకరించారు.
ఈ తోకచుక్క వ్యాసం దాదాపు 600 మీటర్లు అంటే ఐదు ఫుట్‌బాల్ మైదానాలంత పెద్దది. ఇది మృతి చెందిన తోకచుక్క అని, సూర్యుడి చుట్టూ చాలా సార్లు తిరగడంతో దీనిలో ఉండే మంచు, వాయువులు మొత్తం ఆవిరైపోయి, చివరికి గ్రహశకలంగా మిగిలి ఉంటుందని విష్ణురెడ్డి వెల్లడించారు. మన సౌర వ్యవస్థకు ఆవలి వైపు నుంచి ఇది వచ్చిందని, ప్రస్తుత శతాబ్దంలో మళ్లీ ఇది కనిపించే అవకాశం లేదని తెలిపారు.