SOFIA telescope: గ్రహశకలాలపై నీటి జాడలు
గ్రహశకలాలు పూర్తిగా పొడి శిలలతో కూడుకుని ఉంటాయని ఇప్పటిదాకా సైంటిస్టులు భావించేవారు. కానీ అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా వాటిపై నీటి అణువుల జాడలను గుర్తించారు! సోఫియా (స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రా రెడ్ ఆ్రస్టానమీ ఎయిర్‌బోర్న్ టెలిస్కోప్) టెలిస్కోప్ అందించిన డేటాను అధ్యయనం చేసిన మీదట వారు ఈ మేరకు ధ్రువీకరణకు వచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో సోమవారం ప్రచురితమయ్యాయి.
ఇలా చేశారు...
గ్రహశకలాలపై నీటిజాడను కనిపెట్టేందుకు సైంటిస్టులు పెద్ద ప్రయాసే పడాల్సి వచి్చంది...
► ముందుగా ఇన్ఫ్రా రెడ్ కిరణాలను దాదాపుగా పూర్తిగా అడ్డుకునే భూ వాతావరణానికి ఎగువన ఉండే స్ట్రాటోస్పియర్ను తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు.
► అవసరమైన మార్పుచేర్పులు చేసిన బోయింట్ 747ఎస్పీ విమానంలో స్ట్రాటోస్పియర్ గుండా సోఫియా టెలిస్కోప్‌ను సుదీర్ఘకాలం ప్రాటు పయణింపజేశారు.
► ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది. ఐరిస్, మస్సాలియా అనే గ్రహశకలాలపై నీటి అణువుల జాడను సోఫియా తాలూకు ఫెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా (ఫోర్కాస్ట్) స్పష్టంగా పట్టిచ్చింది!
► సోఫియా కెమెరా కంటికి చిక్కిన నీటి పరిమాణం కనీసం 350 మిల్లీలీటర్ల దాకా ఉంటుందని అధ్యయన బృందం నిర్ధారించింది.
► ఈ గ్రహశకలాలు సూర్యుడి నుంచి ఏకంగా 22.3 కోట్ల మైళ్ల దూరంలో గురు, బృహస్పతి గ్రహాల మధ్యలోని ప్రధాన ఆస్టిరాయిడ్ బెల్ట్‌లో ఉన్నాయి.
► ఈ ఉత్సాహంతో సోఫియా కంటే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మరో 30 గ్రహశకలాలపై నీటి జాడలను మరింత స్పష్టంగా కనిపెట్టే పనిలో నాసా
సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు.
జాబిలిపై నీటి జాడలే స్ఫూర్తి...
గతంలో చంద్రునిపై నీటి జాడలను కనిపెట్టింది కూడా సోఫియానే! ఆ స్ఫూర్తితోనే అదే టెలిస్కోప్ సాయంతో గ్రహశకలాలపైనా నీటి జాడల అన్వేషణకు పూనుకున్నారు. నిజానికి ఈ అధ్యయనానికి సహ సారథ్యం వహించిన నాసా సైంటిస్టు డాక్టర్ మాగీ మెక్ ఆడమ్ ఈ గ్రహశకలాలపై గతంలోనే ఆర్ర్దీకరణ(హైడ్రేషన్) జాడలను కనిపెట్టారు. కానీ దానికి కారణం నీరేనా, లేక హైడ్రోక్సిల్ వంటి ఇతర అణువులా అన్నదానిపై మాత్రం స్పష్టతకు రాలేకపోయారు.
ఆ అనుమానాలకు తాజా అధ్యయనం తెర దించిందని దానికి సారథిగా వ్యవహరించిన రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ అనీసియా అరెడొండో తెలిపారు. ‘‘నిజానికి డాక్టర్ మెక్ ఆడమ్ తన పరిశోధనకు ఎంచుకున్న ఈ రెండు గ్రహశకలాలు పూర్తిగా సిలికేట్మయం. కనుక అవి పూర్తిగా పొడిబారినవే అయ్యుంటాయని తొలుత అనుకున్నాం. కానీ వాటిపై కనిపించింది నీరేనని మా పరిశోధనల్లో స్పష్టంగా తేలింది’’ అని వివరించారు. 2020లో చంద్రుని దక్షిణార్ధ గోళంలో నీటి జాడలను సోఫియా నిర్ధారించింది.
ఏమిటీ గ్రహశకలాలు...
ఒక్కమాటలో చెప్పాలంటే మన సౌర వ్యవస్థ రూపొందే క్రమంలో మిగిలిపోయిన అవశేషాలు. ఒకరకంగా సూర్యుడు, తన నుంచి నిర్ధారిత దూరాల్లో గ్రహాలు ఒక్కొక్కటిగా రూపొందే క్రమంలో మిగిలి విడిపోయిన వ్యర్థాల బాపతువన్నమాట. సౌర వ్యవస్థ ఏర్పడే క్రమంలో సూర్యుడికి కాస్త దూరంలో ఉన్న భూమి వంటి గ్రహాలు రాళ్లు తదితరాలకు ఆలవాలంగా మారితే సుదూరంలో ఉన్న యురేనస్, నెప్ట్యూన్ వంటివి నింపాదిగా చల్లబడి మంచు, వాయుమయ గ్రహాలుగా రూపుదిద్దుకుంటూ వచ్చాయట.
గ్రహశకలాలు కోట్లాది ఏళ్ల క్రితం భూమిని విపరీతమైన వేగంతో ఢీకొన్న ఫలితంగానే మన గ్రహంపై నీరు ఇతర కీలక మూలకాలు పుట్టుకొచ్చాయని సైంటిస్టులు చాలాకాలం క్రితమే సిద్ధాంతీకరించారు. గ్రహశకలాలపై నీటి అణువుల ఉనికి దానికి బలం చేకూర్చేదేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రహశకలాల పరమాణు కూర్పును మరింత లోతుగా పరిశోధిస్తే అంతరిక్షంలో వీటి జన్మస్థానంపై ఇంకాస్త కచి్చతమైన నిర్ధారణకు రావచ్చన్నది సైంటిస్టుల భావన. అది అంతరిక్షంలో ఇతర చోట్ల నీరు తదితర కీలక మూలకాలతో పాటు జీవం ఉనికి కోసం చిరకాలంగా చేస్తున్న పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడగలదని వారంటున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్