
బీబీఎం చదివి చోరీల బాట
ల్యాప్‌టాప్‌ల చోరీకి పాల్పడుతున్న ఓ బీబీఎం గ్రాడ్యుయేట్‌ను నారాయణగూడ పోలీసులు పట్టుకొని 12 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.
హిమాయత్‌నగర్: ల్యాప్‌టాప్‌ల చోరీకి పాల్పడుతున్న ఓ బీబీఎం గ్రాడ్యుయేట్‌ను నారాయణగూడ పోలీసులు పట్టుకొని 12 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. క్రైం ఎస్‌ఐ కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన ఎం.శ్రీనివాసులురెడ్డి (25) బీబీఎం చదివాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసినా రాకపోవడంతో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. నగరంలోని ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటూ విద్యార్థుల ల్యాప్‌టాప్‌లు చోరీ చేస్తున్నాడు. వీటిని కర్నూలు తీసుకెళ్లి విక్రయిస్తున్నాడు.
స్నేహితులతో తాను సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్‌ల వ్యాపారం చేస్తున్నానని చెప్పుకొనేవాడు. ఇదిలా ఉండగా..ఈనెల 3న హిమయత్‌నగర్ తెలుగు అకాడమీ సమీపంలోని ఫేమస్ బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్న ఉప్పుతోళ్ల శ్రీనాథ్ తన ల్యాప్‌టాప్ చోరీకి గురైందని నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో నిఘా పెట్టిన పోలీసులు శ్రీనివాసులురెడ్డిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించగా దిల్‌సుఖ్‌నగర్, ఎస్సార్‌నగర్, నారాయణగూడ పీఎస్‌ల పరిధిలో మరో 11 ల్యాప్‌టాప్‌లు చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి 12 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.