50లక్షల మంది పెన్షనర్లకు ఊరట!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కష్టాల నేపథ్యంలో దాదాపు 50 లక్షల మంది పెన్షనర్లకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఊరట కల్పించింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ వద్ద సమర్పించాల్సిన జీవిత ధృవీకరణ పత్ర తుది గడువును జనవరి 15వరకు పొడిగించింది. ఈ మేరకు 120 మందికి పైగా ఫీల్డ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీచేశామని, 2017 జనవరి 15వరకు జీవిత ధృవీకరణ పత్రాల సమర్పణ గడువును పొడిగిస్తున్నట్టు తెలిపినట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు.
పెద్ద నోట్ల రద్దుతో కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల ఈ గడువును పొడిగిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఈపీఎఫ్‌ఓ పెన్షనర్లు నవంబర్ వరకు తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంది. లేని పక్షంలో వారి పెన్షన్లను ఆగిపోనున్నాయి. కానీ ఈ తుది గడువును పెంచి ఈపీఎఫ్‌ఓ పెన్షనర్లకు ఊరట కల్గించింది. కాగ ఈ జీవిత ధృవీకరణ పత్రాలను మొబైల్ ఫోన్ల జీవన్ ప్రమాణ్ సాప్ట్వేర్ అప్లికేషన్ ద్వారా ఈపీఎఫ్ఓ స్వీకరిస్తోంది. అదేవిధంగా ఈ పత్రాల సమర్పణకు రెండు లక్షల కామన్ సర్వీసు సెంటర్లను ఈపీఎఫ్ఓ ఏర్పాటుచేసింది.