కిమ్ జోంగ్ ఉన్ భార్య హత్య?
కిమ్ జోంగ్ ఉన్ భార్య హత్య?
Published Thu, Nov 3 2016 4:13 PM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు అకస్మాత్తుగా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె ప్రజలకు కనిపించి దాదాపు ఏడు నెలలు అవుతోంది. గత మార్చి 28న ఆమె చివరిసారిగా భర్త కిమ్‌తో కలిసి ప్యాంగ్యాంగ్‌లో ఓ బహిరంగ కార్యక్రమంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె కనిపించలేదు.
దీంతో ఆమె అదృశ్యంపై ఊహాగానాలు, వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తర కొరియా ప్రచార కార్యకలాపాల విభాగం చీఫ్‌గా ఉన్న కిమ్ సోదరితో విభేదాల కారణంగానే సోల్ జు అదృశ్యమైందని కొందరు చెప్తుండగా.. స్వయంగా కిమ్ భార్యను చంపి ఉంటాడని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
భర్తే హత్యచేశాడా?
దేశద్రోహం ఆరోపణలపై కిమ్ తన మేనమామ జాంగ్ సాంగ్ థేక్‌ను 2013 డిసెంబర్‌లో ఉరితీసిన సంగతి తెలిసిందే. అతనికి సన్నిహితురాలైన తన భార్య సోల్ జుతో కిమ్‌కు విభేదాలు వచ్చాయని చెప్తున్నారు. దీంతో కిమ్ ఆమెను చంపేసి ఉంటారని అనుమానిస్తూ పలు కథనాలు వచ్చాయి. తన సన్నిహితులు, బంధువులను ఉరితీయించిన ఘనత కలిగిన కిమ్‌కు భార్యను ఉరితీయించడం పెద్ద కష్టమేమి కాదని ఈ కథనాలు పేర్కొంటున్నాయి.
గర్భవతి అయిందా!?
ఉత్తరకొరియా పరిణామాలను నిశీతంగా గమనించే టోక్యోలోని వసేదా యూనివర్సిటీ ప్రొఫెసర్ తోషిమిత్సు షిగెమురా కిమ్ భార్య సోల్ జు అదృశ్యంపై పలు విషయాలు తెలిపారు. ప్యాంగ్యాంగ్‌లో ఇటీవల రాజకీయ అస్థిరత నెలకొనడం, పలు దాడులు జరగడంతో ప్రత్యేక రక్షణ నడుమ సోల్ జును ఉంచారని, అత్యంత భద్రత నడుమ ఉండటం వల్లే ఆమె బయటికి రాలేదని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు సోల్ జు గర్భవతి అయి ఉండొచ్చునని, అందుకే బయట కనిపించడం లేదని మరికొందరు అనుమానిస్తున్నారు. 2012లో సోల్ జు ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే, అధికారికంగా ఉత్తరకొరియా ప్రకటన చేయడం లేదా.. సోల్ జు ప్రజల ముందుకువస్తేనే ఈ ఊహాగానాలన్నింటికీ తెరపడుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఉత్తర కొరియా విషయమై పలు వదంతులు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement