చిన్న కిమ్ జాంగ్ ఉన్ ఉన్నాడు..!!
సాక్షి, ప్యాంగ్‌యాంగ్: ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌తో పాటు క్రూరత్వం అంతం కాదని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. కిమ్ జాంగ్ ఉన్, రీ సోల్ జూ దంపతుల 'తొలి సంతానం'(పేరు ఎవ్వరికీ తెలియదు) పాలన కొనసాగించేందుకు సకల విద్యలలో ప్రావిణ్యం సాధిస్తున్నట్లు దక్షిణ కొరియా గూఢచార సంస్థ పేర్కొంది.
కిమ్, రీ సోల్ జూలకు మొత్తం ముగ్గురు సంతానంగా భావిస్తున్నారు. వీరికి 2009లో వివాహం జరగుగా.. 2010లో రీ సోల్ బిడ్డ(లింగం తెలియదు)కు జన్మినిచ్చారు. అనంతరం 2013లో రెండో కాన్పులో రీ సోల్ అమ్మాయికి జన్మనిచ్చినట్లు తెలిసింది. ఉత్తరకొరియా వెళ్లిన బాస్కెట్‌బాల్ మాజీ క్రీడాకారుడు డెన్నిస్ రాడ్‌మన్ కిమ్-రీ సోల్ జూల పుత్రికను తాను ఎత్తుకుని ఆడించినట్లు చెప్పారు. వాళ్లది చూడచక్కనైన కుటుంబమని కితాబిచ్చారు కూడా.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రీ సోల్ మూడో సంతానానికి జన్మనిచ్చినట్లు కూడా రిపోర్టులు వచ్చాయి. అందుకు తగ్గట్లే ఆమె ఒక ఏడాది నుంచి బయట కనిపించడం లేదు. దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ ఇచ్చిన సమాచారం సరైనదే అయితే.. భవిష్యత్తులో చిచ్చరపిడుగు చిన్న కిమ్.. ఉత్తరకొరియా పాలనను చేపడతాడన్న మాట!