జీన్స్ ప్యాంట్లు ధరిస్తే తోలు తీస్తాం!
చెవిపోగులపైనా నిషేధం
దేశంలో ఎవరూ జీన్స్ ప్యాంట్లు ధరించవద్దు. చెవిపోగులు పెట్టుకోకూడదు. పాశ్చాత్య ఫ్యాషన్లపై ఏ మాత్రం వ్యామోహం పెంచుకోకూడదంటూ ఉత్తర కొరియన్లపై ఆ దేశ నియంత మరిన్ని ఆంక్షలు విధించాడు. దేశవ్యాప్తంగా పాశ్చాత్య పోకడలపై అణచివేతను నియంత కిమ్ జాంగ్ ఉన్ ముమ్మరం చేశాడు. మరీ ముఖ్యంగా చైనాకు సమీపంలో ఉన్న నార్త్ హంగ్వాంగ్, యాంగాంగ్ ప్రావిన్స్‌ల్లో ఈ అణిచివేత ఆదేశాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్దేశించాడు.
ఈ ప్రావిన్స్‌ల్లోని ప్రజలకు బయటి ప్రపంచంతో ఎక్కువ అనుబంధం ఉండటంతో, వీరిలో సహజంగానే పాశ్చాత్య ఫ్యాషన్లపై మోజు పెరుగుతున్నదని, ఇది అధికార వర్గాన్ని ఆందోళన పరుస్తున్నదని పరిశీలకులు చెప్తున్నారు. ఉత్తర కొరియా అధికార పార్టీ అయిన వర్కర్స్ పార్టీ 7వ కాంగ్రెస్ త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఈ నిబంధనలను మరింత కఠినంగా అమలుచేయాలని నిర్ణయించినట్టు జపాన్‌కు చెందిన ఏషియా ప్రెస్ తెలిపింది. దేశంలో అత్యధికులు పాశ్చాత్య సంస్కృతి పట్ల ఆకర్షితులవుతుండటంతో 7వ కాంగ్రెస్ నాటికి దీనిని అణచివేసేందుకు చర్యలు కొనసాగనున్నాయని కొరియాలో జర్నలిస్టుగా పనిచేస్తున్న జపనీయన్ ఇషిమారు జిరో తెలిపారు. కిమ్ జాంగ్ ఉన్‌కు విధేయులైన యూత్ గ్రూప్స్ ఈ నిబంధనలను అమలు చేయనున్నాయని, క్యాపిటలిస్టు టెండన్సీస్ అయిన జీన్స్, మినీ స్కర్ట్, టీ-షర్ట్లు, హెయిర్ స్టైల్‌ను పౌరులు అనుసరించకుండా ఈ గ్రూపులు కాపలా కాయనున్నాయి.
దేశంలోని పురుషులంతా రెండు సెంటీమీటర్లకు మించి వెంట్రుకలు పెంచకుండా తన తరహాలోనే హెయిర్ స్టైల్ ను అనుసరించాలని కొన్ని నెలల కిందట కింగ్ జాంగ్ ఉన్ ఆదేశాలు ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. మహిళలేమో తన భార్య రి సోల్ జు బాబ్ హెయిర్ కట్‌ను ఫాలో కావాలని సలహా ఇచ్చారు. పాశ్చాత్య పోకడలు, హెయిర్ స్టైల్ విషయంలో ఎవరైనా ప్రభుత్వ ఆంక్షలతో కూడిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. వారిని పెట్టుబడిదారుల అనుకూలురిగా భావించి నిఘా పెడతామని ఉన్ ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు అమెరికా, దక్షిణ కొరియా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా వరుసగా అణ్వాయుద్ధ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.