ఫేస్బుక్ మా రహస్యాలు దొంగిలిస్తోంది!
ఫేస్బుక్కు రోజులు బాగున్నట్లు లేవు. వరుసపెట్టి ఈ సోషల్ మీడియా సైట్ మీద కేసులు నమోదవుతున్నాయి. వేరే వ్యక్తి పోస్ట్ చేసిన తన అసభ్య చిత్రాలను తొలగించాలంటూ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఓ మహిళ 725 కోట్ల రూపాయలకు దావా వేయగా, ఇప్పుడు ఆస్ట్రియాకు చెందిన న్యాయ విద్యార్థి మాక్సిమలియిన్ ష్రెమ్స్ మరో కేసు వేశాడు. యూజర్ల వ్యక్తిగత రహస్యాలను ఉల్లంఘించిందంటూ ఫేస్బుక్పై కేసు వేయడమే కాక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్లంత తనతో ఈ పోరాటంలో కలిసిరావాలని కోరాడు. లక్షలాది యూజర్ల వ్యక్తిగత విషయాలను ఎన్ఎస్ఏ నిఘా సంస్థకు వాళ్ల 'ప్రిజమ్' అనే నిఘా కార్యక్రమం కోసం ఫేస్బుక్ ఇచ్చేసిందని ష్రెమ్స్ కేసు వేశాడు. లైక్ బటన్ ద్వారా థర్డ్ పార్టీ వెబ్సైట్లకు చెందిన యూజర్లను కూడా ట్రాక్ చేస్తోందని, యూజర్లు ఆన్లైన్లో ఏం చేస్తున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోవడం ద్వారా డేటా ప్రైవసీ చట్టాలను ఉల్లంఘిస్తోందని చెప్పాడు.
ఆస్ట్రియాకు చెందిన చాలామంది ష్రెమ్స్తో పాటు ఈ పోరాటంలో చేరాడు. ఇలా చేరేవాళ్లెవరూ ఒక్క పైసా కూడా లీగల్ ఫీజుగా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే.. జర్మనీకి ఎందిన రోనాల్డ్ ప్రోజెస్ ఫైనాన్జ్ అనే సంస్థ మాత్రం ఈ వ్యాజ్యానికి కావల్సిన సొమ్మంతా తానిస్తానని ముందుకొచ్చింది. కేసు ఓడిపోతే పైసా కూడా వెనక్కి తీసుకోరు. గెలిస్తే మాత్రం వచ్చే సొమ్ములో 20 శాతం ఇవ్వాలి. చాలావరకు ఇంటర్నెట్ కంపెనీలు ఇలాగే చేస్తున్నాయని, ఫేస్బుక్ అనేది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమేనని ష్రెమ్స్ అన్నాడు. ఆగస్టు ఒకటో తేదీ వరకు ష్రిమ్స్తో పాటు అతడి పోరాటంలో 2,500 మంది చేరారు.