గ్రేటర్ ఎన్నికల్లో కలసి పోటీ.. 12న సీఎంపీ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: క్లీన్ పాలిటిక్స్(నీతివంతమైన రాజకీయాలు) అనే నినాదంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల బరిలో దిగాలని వామపక్ష కూటమి నిర్ణయించింది. సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, ఎంసీపీఐ(యూ), వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, ఎంబీసీ జేఏసీ, బీసీ సబ్‌ప్లాన్ కమిటీలు, సామాజిక సంస్థలు, వ్యక్తులు కలసి కూటమిగా ఏర్పడి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని (సీఎంపీ) ప్రకటించనున్నాయి. సీఎంపీలో భాగంగా నీళ్లు, కాలుష్యం, అభివృద్ధి అంశాలతోపాటు నగర సమస్యలకు పరిష్కారాలను సూచించనున్నాయి.
ప్రస్తుత రాజకీయాలు అవినీతిమయమై పోయాయని, నీతి, నిజాయితీలను ప్రోత్సహించాలనే నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఈ కూటమి నిర్ణయించింది. ఈ నెల 12న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే బహిరంగసదస్సులో కూటమి నాయకులు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటించనున్నారు. అదేరోజు సీట్ల సర్దుబాటును కూడా ఈ కూటమి ప్రకటించనుంది. సీపీఎం 30-40, సీపీఐ 30-35, లోక్‌సత్తా 30-40, ఎంసీపీఐ కొన్నిచోట్ల, ఎంబీసీ జేఏసీ, బీసీసంస్థల బలాన్ని బట్టి ఆయా స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమికంగా అంచనాకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పొత్తుల కోసం టీపీసీసీ నేతలు సంకేతాలు పంపినా సీపీఐ, సీపీఎం నేతలు తిరస్కరించారని తెలిసింది.
బూర్జువా పార్టీలతో పొత్తు లేదు: వామపక్ష నేతలు
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వంటి బూర్జువా పార్టీలతో అవగాహన కాని, సీట్ల సర్దుబాటు కాని ఉండదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు అజీజ్‌పాషా స్పష్టం చేశారు. వారు ‘సాక్షి’తో విడివిడిగా మాట్లాడుతూ గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఈ ఎన్నికల ద్వారా ప్రయత్నిస్తామని చెప్పారు.
వామపక్ష కూటమి ‘క్లీన్ పాలిటిక్స్’
Published Wed, Jan 6 2016 3:50 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM
Advertisement
Advertisement