సర్కార్‌పై సమరానికి వామపక్షాలు సై అంటున్నాయి. మున్సిపల్ కార్మికుల సమ్మెపట్ల ప్రభుత్వం నిరంకుశంగా
మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంఘీభావం
నిరవధిక దీక్షలు,
రాష్ట్ర బంద్‌కూ వెనుకాడం
సర్కార్ మొండి వైఖరిపై ఆగ్రహం
హైదరాబాద్: సర్కార్‌పై సమరానికి వామపక్షాలు సై అంటున్నాయి. మున్సిపల్ కార్మికుల సమ్మెపట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా బుధవారం నుంచి హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్ష చేపడుతున్నట్లు పది వామపక్షాలు ప్రకటించాయి. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని యెడల నిరవధిక దీక్షలు చేస్తామని, అవసరమైతే రాష్ర్టబంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించాయి. ఈ సమ్మెకు సంఘీభావంగా మిగతా రంగాల కార్మికులు ఒకరోజు సమ్మె చేయాలని సూచించాయి. బుధవారం చేపట్టే నిరాహారదీక్షలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), తదితర పార్టీల నాయకులు పాల్గొంటారని తెలిపాయి.
సమ్మెను ఉధృతం చేసే విషయంపై మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో భేటీ అయిన అనంతరం తమ్మినేని వీరభద్రం(సీపీఎం), పల్లా వెంకటరెడ్డి(సీపీఐ), సాదినేని వెంకటేశ్వరావు (న్యూడెమోక్రసీ-చంద్రన్న), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), బూతం వీరయ్య (సీపీఐ-ఎంఎల్), శ్రీనివాస్ (ఫార్వర్డ్‌బ్లాక్) విలేకరులతో మాట్లాడారు. కార్మికులు సమ్మెను విరమించకపోతే మిలటరీ బలగాలు, పోలీసులను దింపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడం ప్రజా, కార్మిక వ్యతిరేక వైఖరికి నిదర్శనమని త మ్మినేని ధ్వజమెత్తారు. తుపాకులు, తూటాలు, లాఠీలు సమస్యను పరిష్కరించలేవన్నారు. అణచివేత చర్యలకు సహకరించవద్దని పోలీసు సంఘానికి విజ్ఞప్తి చేశారు. పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని కార్మికసంఘాల జేఏసీని చర్చలకు పిలవాలని కోరారు.