ఎల్‌ఐసీ కొత్త మనీ బ్యాక్ పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎల్‌ఐసీ మారిన నిబంధనలను అనుసరించి పాత జీవిత బీమా పథకాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది. ఇం దులో భాగంగా ‘ప్రీమియం ఎండోమెంట్’ పేరుతో తొలి పథకాన్ని ప్రవేశపెట్టగా, సోమవారం నుంచి న్యూ మనీ బ్యాక్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. 20, 25 ఏళ్ళ కాలపరిమితితో లభించే ఈ మనీబ్యాక్ పాలసీలకు చెల్లించాల్సిన ప్రీమియం కాలపరిమితులను వరుసగా 15, 20 ఏళ్లుగా నిర్ణయించడమైనది. 20 ఏళ్ల పాలసీలో ప్రతీ 5 ఏళ్లకు 20% చొప్పున, అదే 25 ఏళ్లయితే 15%చొప్పున వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. వార్షిక ప్రీమియానికి 10 రెట్లు బీమా రక్షణ, మరణం సంభవిస్తే 125% బీమా రక్షణ మొత్తాన్ని చెల్లిస్తారు.
ఇక జీవిత బీమా పథకాల విషయానికి వస్తే ప్రతీ సంవత్సరం లేదా ఒకేసారి ప్రీమియం చెల్లించే విధంగా రెండు రకాల ఎండోమెంట్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. కనీసం 12 నుంచి 35 ఏళ్ళ కాలపరిమితితో ఈ పాలసీని 8 నుంచి 55 ఏళ్లలోపు వారు తీసుకోవచ్చు. కాలపరిమితి మధ్యలోనే పాలసీదారుడు మరణిస్తే చెల్లించిన ప్రీమియానికి 105% తక్కువ కాకుండా క్లెయిమ్ మొత్తాన్ని చెల్లిస్తుంది. అదే సింగిల్ ప్రీమియం పాలసీలో కనీస కాలపరిమితిని 10 ఏళ్లు, గరిష్ట కాలపరిమితిని 25 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ పాలసీలపై రుణ సౌకర్యం కూడా ఉంది.