గెలిచినా.. ఓడినా షీలాకే..!
న్యూఢిల్లీ: అన్నీతానై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నడిపించిన ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్‌కే కాంగ్రెస్ పార్టీ గెలుపోటముల కీర్తి-అపకీర్తి దక్కనుంది. పదిహేనేళ్ల కాంగ్రెస్‌పాలనపై ఢిల్లీవాసులు ఆగ్రహంగా ఉన్నారని, వారంతా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మొండిచెయ్యి చూపనున్నట్టు సర్వేలు ఇప్పటికే తేల్చేశాయి. అయితే అనూహ్య పరిణామాలతో గెలిచి తీరతామన్న ధీమా కాంగ్రెస్ నాయకుల్లో ఇంకా మిగిలే ఉంది.
అదే జరిగితే ఆ క్రెడిట్ అంతా షీలాదీక్షిత్‌కే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని నిత్యం చెప్పే షీలాదీక్షిత్‌కి ఇటీవల కొన్ని సంఘటనలు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. శాంతిభద్ర తల అంశం ఆమె చేతుల్లో లేనప్పటికీ నిర్భయ ఘటనతో షీలాదీక్షిత్ ప్రతిభ మసకబారింది. అదే సమయంలో చుక్కల్లోకి చేరిన ఉల్లి, కూరగాయల ధరలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. పదిహేనేళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓటమి తప్పదన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం షీలాదీక్షిత్‌ను ఒంటరిని చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆకర్షణ కావాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభలకు జనం పల్చబడడంతో ఆయన నెమ్మదిగా మెహం చాటేశారు. మొదట బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి ధీటుగా రాహుల్ సభలు నిర్వహించాలని భావించారు. ఆ తర్వాత పరిణామాలతో మరింత నష్టం జరుగుతుందని భావించిన పార్టీ అధిష్టానం రాహుల్ ప్రచార సభలు తగ్గించి ఆయనను తప్పించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం ఒక్కటంటే ఒక్కటే సభతో సరిపెట్టారు.
ఇక ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ బహిరంగ సభలో పాల్గొంటారని ప్రకటించినా మోడీ సభలకు వస్తున్న స్పందన చూసి ఆ సాహసం చేయలేక విదేశీ అధ్యక్షుల పర్యటనను సాకుగా చూపి చాలించుకున్నారు. పార్టీ ఎంపీల్లోనూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జేపీ అగర్వాల్ మినహా మరెవరూ ఆసక్తి చూపలేదు. కేంద్ర మంత్రి కపిల్ సిబల్ సైతం రెండు మూడు సభలకే పరిమితమయ్యారు. అధిష్టానం మొహం చాటేసినా 75 ఏళ్ల షీలాదీక్షిత్ ఒంటి‘చేత్తో’ ప్రచారరథాన్ని నడిపించారు. పదిహేనేళ్ల పాలనలో తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మరోమారు తనను ఢిల్లీ గద్దెపై కూర్చోబెడతాయన్న ధీమాతో షీలా ఉన్నారు.