ఢిల్లీ ఎన్నికల్లో అతిక్రమణలపై 313 కేసులు
ఆమ్‌ఆద్మీపార్టీపై 90, బీజేపీపై 68, కాంగ్రెస్‌పై 59
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై పోటీకి దిగుతున్న అరవింద్ కేజ్రీవాల్ కూడా తాజాగా ఈ ఉల్లం‘ఘనుల’ జాబితాలో చేరారు. మతం పేరుతో ముస్లింల ఓట్లు అడిగిన కారణంగా కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం బుధవారం నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు మరో 12 రోజులే మిగిలి ఉండడడంతో ఎన్నికల అధికారులు అభ్యర్థుల ప్రచారసరళిని డేగకళ్లతో పరిశీలిస్తున్నారు. ఏమాత్రం కట్టుదాటినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఈసీ నిబంధనల కొరడా ఝులిపిస్తుండడంతో అభ్యర్థులు ఎంతో అప్రమత్తంగా మసలుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఉల్లంఘనల్లో ఆప్ నేతలే టాప్..
ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం 2,908 ఫిర్యాదులు రాగా.. 313 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆమ్‌ఆద్మీపార్టీ నాయకులపైనే అత్యధికంగా 90 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. బీజేపీ నాయకులపై 68, కాంగ్రెస్ నాయకులపై 59 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)పై కూడా 23 కేసులు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. వీరితోపాటు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న కొన్ని ప్రింటింగ్ ప్రెస్‌ల నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా నేర చరిత్ర ఉన్న 7,708 మంది వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 920 లెసైన్స్‌డ్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. 222 మందిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు.
పెరుగుతున్న ఉల్లం‘ఘనులు’..!
Published Fri, Nov 22 2013 1:26 AM | Last Updated on Mon, Aug 20 2018 3:46 PM
Advertisement