జెయింట్ కిల్లర్!
జెయింట్ కిల్లర్!
Published Mon, Dec 9 2013 1:58 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన కేజ్రివాల్.. ఆతర్వాత అన్నా హజారే జన లోక్ పాల్ ఉద్యమం ద్వారా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వాలను, ఢిల్లీ ప్రభుత్వాల వెన్నులో వణుకు పుట్టించిన 'నిర్భయ' ఘటనకు కేజ్రివాల్ ఆయన బృందం స్పందించిన తీరు పౌరులను ఆకట్టుకుంది. ఆటోల మీద ఏర్పాటు చేసే వ్యాపార ప్రకటనల మీద స్థానిక సంస్థలు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమించిన తీరు కే్జ్రివాల్ పై మరింత నమ్మకం పెంచింది. నీటీ, విద్యుత్ బిల్లుల పెంపును వ్యతిరేకిస్తూ.. బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ స్థానికంగా ప్రజల్లోకి దూసుకెళ్లింది.
రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించే దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ఉద్యమాల ద్వారా ఢిల్లీ ప్రజలకు భరోసా కల్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో రాజకీయ నాయకులకు ప్రాధాన్యత కల్పించకుండా..సామాన్య వ్యక్తులనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పెట్టి ఓటర్ల దృష్టిని ఆకర్షించడంలో కేజ్రివాల్ సఫలమయ్యారు. రోజు రోజుకూ ఆమ్ ఆద్మీ పట్ల ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తూ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో వణుకు పుట్టించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ సృష్టిస్తున్న ప్రభంజనాన్ని జీర్టించుకోలేక షీలా దీక్షిత్ 'ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే. ఆప్ అసలు పార్టీయే కాదు', విమర్శలు చేయగా, 'దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో మాట్లాడాలి' అంటూ ఇతర పార్టీలు విసిరిన సవాళ్లకు ఆమ్ ఆద్మీపార్టీ నేత, కామన్ మ్యాన్ అరవింద్ కేజ్రివాల్ దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పారు. 15 సంవత్సరాలపాటు ఢిల్లీని పాలించిన ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, క్లీన్ ఇమేజ్ తో బీజేపీ విజయేంద్ర గుప్తాలకు దిమ్మ తిరిగేలా ఓటమి రుచి చూపించిన కేజ్రివాల్ కు రాజకీయ అనుభవం శూన్యమే. అయినా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రివాల్ అనుసరించిన పంథా, పార్టీ విధానాలు ప్రజల్లో, ఓటర్లలో విశ్వాసం పెంచాయి.
షీలా దీక్షిత్ ఓడించడమే తన లక్ష్యం అని, ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పోటీ చేసినా తాను అక్కడే పోటీ చేస్తానని సవాల్ విసిరి కేజ్రివాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ శ్రేణుల్లో విశ్వాసం పెంపొందించారు. షీలా దీక్షిత్, కేజ్రివాల్ ల మధ్య పోరులో బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన విజయేంద్ర గుప్తాను రంగంలో నిలుపడంతో పోటీ మరింత ఆసక్తిగా మారింది. పదిహేనేళ్ల షీలా హయాంలో చోటుచేసుకున్న కామన్ వెల్త్ క్రీడల కుంభకోణం, నిర్భయ ఘటన, చార్జీల పెంపుకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడమేకాకుండా, చైతన్యాన్ని కూడా కేజ్రివాల్ నింపారు. రాజకీయ ఉద్దండుల ప్రచారం, పార్టీల బలమైన వ్యూహాలు కేజ్రి'వాల్'ను ఏమి చేయలేక చతికిలపడ్డాయి. కొద్దికాలంలో రాజకీయాల్లో దూకుడు, పరిణతి చెందిన నిర్ణయాలకు సానుకూలంగా స్పందించిన ఓటర్లు..ఓ సామాన్యుడికి కూడా రాజకీయాల్లో స్థానం ఉంటుందనే అభిప్రాయాన్ని ఓటు ద్వారా ప్రజలు ఎలుగెత్తి చాటారు. ప్రజలు అందించిన మద్దతుతో రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న షీలా దీక్షిత్ ను, గుప్తాలను మట్టికరిపించి న్యూఢిల్లీ నియోజకవర్గంలో 25,864 ఓట్ల విజయంతో 'జెయింట్ కిల్లర్'గా నిలిచాడు.
Advertisement
Advertisement