వాళ్లను మీరు శిక్షించాల్సిందే: మోదీ
ఢిల్లీ వాసులకు రోజుకు 24 గంటలూ విద్యుత్ సరఫరా అయ్యేలా చూస్తామని, అందరికీ ఇళ్లు కట్టిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. అయితే.. ఆమ్ ఆద్మీ పార్టీని మాత్రం ప్రజలు శిక్షించి తీరాలని పిలుపునిచ్చారు. ప్రజలిచ్చిన అధికారాన్ని కాదని అర్ధంతరంగా ప్రభుత్వం నుంచి వైదొలగినందుకు వాళ్లను శిక్షించాల్సిందేనని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో భారీస్థాయిలో జరిగిన బీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అరాచకవాది అని.. అలాగే ఉండాలనుకుంటే ఆయన వెళ్లి మావోయిస్టుల్లో చేరి అడవులకు పోవాలని విమర్శించారు. కాంగ్రెస్ మీద కూడా ఆయన విమర్శలు గుప్పించినా.. ప్రధానంగా మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీనే లక్ష్యంగా చేసుకున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ 28 స్థానాల్లో గెలిచింది. అప్పట్లో బీజేపీ 31 సీట్లు గెలుచుకుంది. ఈసారి అలా కాకుండా.. ఢిల్లీ వాసులు తమకు బలమైన, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపోయేలా మంచి మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరారు.