
మళ్లీ ఎన్డీయే గూటికి ఎల్‌జేపీ
బీహార్‌లో బీజేపీతో పొత్తు ఖరారు... పాశ్వాన్ పార్టీకి 7 ఎంపీ సీట్లు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్‌జన శక్తి పార్టీ (ఎల్‌జేపీ) తిరిగి చేరింది. 2002 నాటి గుజరాత్ అల్లర్ల కారణంగా కూటమి నుంచి వైదొలగిన ఎల్‌జేపీ మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఎన్డీయే గూటికి వచ్చింది. బీహార్‌లో బీజేపీతో లోక్‌సభ ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. దీని ప్రకారం బీహార్‌లోని 40 లోక్‌సభ సీట్లకుగానూ ఎల్‌జేపీ 7 సీట్లలో పోటీ చేయనుంది. మిగిలిన 33 స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. గురువారం రాత్రి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్‌జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్‌తో కలసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పొత్తు విషయాన్ని ప్రకటించారు. ‘‘ఎన్డీయే విస్తరణ మొదలైంది. పాశ్వాన్ ఎన్డీయేలో భాగమయ్యారు. సీట్ల పంపకం పూర్తైది. ఈ పొత్తుతో బీహార్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్డీయేకు లాభం చేకూరుతుంది’’ అని చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో అద్వానీ, మోడీలను పాశ్వాన్ కలుస్తారన్నారు. కాగా, మళ్లీ ఎన్డీయేలోకి రావడం సంతోషంగా ఉందని పాశ్వాన్ పేర్కొన్నారు.
54 మంది అభ్యర్థులతో తొలి జాబితా...
లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న 54 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. మహారాష్ట్ర నుంచి 17 మంది, పశ్చిమ బెంగాల్ నుంచి 17 మంది, ఒడిశా నుంచి ఐదుగురి పేర్లను విడుదల చేసింది. పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ నాగపూర్ నుంచి పోటీలో దిగనున్నారు. రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన గురువారం రాత్రి జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో ఈ జాబితాకు ఆమోదముద్ర పడింది. ఈ సమావేశంలో పార్టీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ, పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతోపాటు సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, మురళీ మనోహర్ జోషీ, వెంకయ్య, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు.