బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ... ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ మధ్య విభేదాలు ముదురుతున్నాయి.
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ... ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఈనెల 27వ తేదీన బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించే ర్యాలీకి పెద్దాయన అద్వానీ హాజరు కావట్లేదు. ఈ విషయాన్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్ మీడియాకు తెలిపారు. అయితే, ర్యాలీకి అద్వానీ హాజరు కాకపోవడాన్ని ఆయన తేలిగ్గా తీసుకున్నారు.
2014 ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా వంద వరకు ర్యాలీలు నిర్వహించాలని పార్టీ తలపెట్టిందని, వాటన్నింటికీ పార్టీ అగ్రనేతలందరూ హాజరు కావడం సాధ్యమయ్యే పని కాదని ఆయన అన్నారు. ఇప్పటికే భోపాల్లో జరిగిన ర్యాలీలో అద్వానీ పాల్గొన్నారని, మరిన్ని ర్యాలీలలో కూడా పాల్గొంటారని తెలిపారు. బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్తో తనకున్న సత్సంబంధాల దృష్ట్యానే అద్వానీ ఈ ర్యాలీలో పాల్గొనడంలేదన్న ఆరోపణలను అనంతకుమార్ ఖండించారు. కాగా, ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చే బీజేపీ శ్రేణుల కోసంఆ పార్టీ పది రైళ్లు, పలు బస్సులను ఇప్పటికే అద్దెకు తీసుకుంది.