‘లోక్‌సభ’పై అసెంబ్లీ ప్రభావం: రషీద్ అల్వీ
న్యూఢిల్లీ: నవంబర్-డిసెంబర్ నెలల్లో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ సాధారణంగా స్థానిక సమస్యలపై ఆధారపడి ఉంటుందని, అయితే, ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలకు దగ్గర్లో ఉన్నాయని ఆయన అన్నారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో నవంబర్ 11 నుంచి డిసెంబర్ 4 మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఢిల్లీ, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనలో ఉండగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు బీజేపీ పాలనలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్, బీజేపీల నడుమనే ప్రధానంగా పోటీ ఉంటుంది. అయితే, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కొత్తగా ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక శక్తిగా పుంజుకుంది. మరోవైపు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కీలకమైనవేనని బీజేపీ కూడా అంగీకరించింది. అయితే, కేంద్రంలోని యూపీఏ సర్కారు అవినీతి, దుష్పరిపాలన కూడా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని బీజేపీ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి ముఖ్య ప్రచారాంశం కాగలదని సీపీఐ నేత డి.రాజా అన్నారు.