లగ్జరీ @ ఆన్‌లైన్.. | luxury @ online | Sakshi
Sakshi News home page

లగ్జరీ @ ఆన్‌లైన్..

Published Tue, Mar 24 2015 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

లగ్జరీ @ ఆన్‌లైన్..

లగ్జరీ @ ఆన్‌లైన్..

విలాస ఉత్పత్తుల మార్కెట్‌కు ఈ-కామర్స్ కిక్
 వినూత్న ఆఫర్లతో ఆకట్టుకుంటున్న లగ్జరీ పోర్టళ్లు...

 
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ద్వారా అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ల ఉత్పత్తుల విక్రయం అంతకంతకూ పెరిగిపోతోంది. పరిమాణంలో తక్కువై నప్పటికీ, విలువ పరంగా ఈ మార్కెట్ జోరు పెరుగుతోంది. డార్వీస్‌డాట్‌కామ్, జెనిసిస్‌లగ్జరీ, ఎలైట్‌ఫై, స్టైల్‌బాప్, ఎక్స్‌క్లూజివ్లీ, రాక్‌ఎన్‌షాప్‌డాట్‌కామ్ తదితర లగ్జరీ షాపింగ్ పోర్టళ్లు అంతర్జాతీయంగా పేరెన్నికగన్న లగ్జరీ బ్రాండ్ల ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నాయి. కేవలం ఆన్‌లైన్ విక్రయాలు మాత్రమే కాకుండా, భారీ డిస్కౌంట్లు, ఈఎంఐ ఆఫర్లు, కస్టమైజ్‌డ్ సేవలందిస్తూ వాటి వ్యాపారాన్ని ఈ లగ్జరీ పోర్టళ్లు పెంచుకుంటున్నాయి.
 
అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు...
దేశీయ వినియోగదారులు అంతర్జాతీయ డిజైనర్లు రూపొందించే లగ్జరీ ఉత్పత్తులను ఒక క్లిక్‌తోనే సొంతం చేసుకుంటున్నారు. ఎమలియో పుక్కి, వాలెంటినో, బొట్టెగ వెనెటా, జిమ్మి చూ, డీకేఎన్‌వై, గుక్కి, బర్‌బెర్రి, వెర్సాసె తదితర అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ల ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశాలు ఇప్పుడు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. డార్వీస్, జెనిసిస్‌లగ్జరీ, ఇలిటిఫై, స్టైల్‌బాప్, ఎక్స్‌క్లూజివ్లీ వంటి లగ్జరీ పోర్టల్స్  ద్వారా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లగ్జరీ బ్రాండ్ల ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. భారత్ హై-ఎండ్ బ్రాండ్స్ అవుట్‌లుక్‌ను సమూలంగా మార్చివేసే ఉద్దేశంతోనే డార్వీస్‌డాట్‌కామ్‌ను ప్రారంభించామని నకుల్ బజాజ్ వెల్లడించారు.  ఈ లగ్జరీ షాపింగ్ పోర్టల్ రిజిష్టర్డ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండడం విశేషం.
 
కస్టమైజ్‌డ్ సర్వీసులు
లగ్జరీ షాపింగ్ మార్కెట్ పరిమిత పరిమాణంలోనే ఉన్నప్పటికీ, వివిధ లగ్జరీ షాపింగ్ పోర్టళ్లు వినూత్నమైన విధానాలను అందిస్తున్నాయి. డార్విస్‌డాట్‌కామ్ అందిస్తున్న వెడ్డింగ్ ట్రౌజవూ ఆఫర్ ఇలాంటిదే. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వధూవరుల కోసం వినూత్నమైన అంతర్జాతీయ స్థాయి డిజైనర్లు రూపొందించిన దుస్తులను, ఉత్పత్తులను అందిస్తోంది. పెళ్లి రోజు వధూవరులిరువురికీ మరుపురాని రోజుగా గుర్తుండేందుకు విభిన్నమైన, వినూత్నమైన, ఎంచుకోవడానికి ఎన్నో వెరైటీలున్న లగ్జరీ దుస్తులను, ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నామని ఈ లగ్జరీ పోర్టల్‌కు చెందిన నకుల్ బజాజ్ పేర్కొన్నారు.

ఎక్స్‌క్లూజివ్లీడాట్‌కామ్ పోర్టల్ అయితే వైట్ గ్లోవ్ పేరుతో వినూత్నమైన సర్వీస్‌ను అందిస్తోంది. వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడంలో భాగంగా ఈ సంస్థ ఇలాంటి సర్వీస్‌ను అందిస్తోంది.  ఈ సర్వీస్‌లో భాగంగా ఈ సంస్థకు చెందిన సిబ్బంది వినియోగదారుల వద్దకే వచ్చి దుస్తులను ఎలా కుట్టాల్లో, ఎలాంటి మోడల్‌లో రూపొందించాలో సలహాలు, సూచనలు తీసుకుంటారు. దీనికి మంచి స్పందన లభిస్తోందని ఎక్స్‌క్లూజివ్లీడాట్‌కామ్  చెబు తోంది. మెట్రో నగరాల్లోనే కాకుండా ఆగ్రా, జైపూర్, లక్నో, భోపాల్, ఛండీఘర్ నగరాల్లోని సంపన్న వినియోగదారులకు కూడా ఈ సర్వీస్‌ను విస్తరిస్తున్నామని వివరించారు.
 
డిస్కౌంట్లు, ఈఎంఐ ఆప్షన్లు...
లగ్జరీ వినియోగదారులను ఆకర్షించడానికి ఈ లగ్జరీ పోర్టళ్లు భారీ డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేస్తున్నాయి. రిటైల్ స్టోర్స్ ఇచ్చే డిస్కౌంట్లతో పోల్చితే ఈ లగ్జరీ పోర్టళ్లు ఇచ్చే డిస్కౌంట్లు అధికంగానే ఉంటున్నాయి. లగ్జరీ ఉత్పత్తులకున్న అధిక విలువను దృష్టిలో పెట్టుకొని రాక్‌ఎన్‌షాప్ సంస్థ ఈఎంఐ ఆప్షన్లను కూడా ఇస్తోంది. తక్షణం చెల్లించాల్సిన బాదరబందీ లేకుండా కోరుకున్న అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ల ఉత్పత్తుల కొనుగోళ్లకు ఈఎంఐ ఆప్షన్ మంచి అవకాశాన్ని కల్పిస్తోందని ఈ పోర్టల్ యజమాని ప్రియ సచ్‌దేవ్ వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement