రోడ్డుపై ఆ ఘటన చూసి చలించిపోయిన హీరో!
వానాకాలం వచ్చిందంటే చాలు.. రోడ్లనిండా ఎటుచూసినా గుంతలే.. ఇక వాటిపై ప్రయాణించాలంటే వాహనదారులకు నరకమే కనిపిస్తుంది. ఇలాంటి రోడ్లను ప్రత్యక్షంగా చూసి ఓ నటుడు చలించిపోయాడు. రోడ్డు మీద గుంతల కారణంగా తన ముందే ఓ యువకుడు బైకు మీద నుంచి పడి గాయాలపాలు కావడం ఆయనను కలిచివేసింది. వెంటనే ఫేస్‌బుక్ వేదికగా ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తూ ఆయన ఓ వీడియో పెట్టాడు. ఈ వీడియోను 11 లక్షలమంది చూశారు. 35వేలమంది షేర్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి కూడా స్పందించారు.
సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోను పెట్టింది మలయాళం హీరో జయసూర్య. తాను చూసిన ఘటనను హృద్యంగా వివరిస్తూ.. అస్తవ్యస్తమైన రోడ్ల కారణంగా పన్నుచెల్లింపుదారులైన సామాన్యులు బలి అవుతున్నారని జయసూర్య ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్లు బాగుచేసి.. ప్రజలను రోడ్డుప్రమాదాల నుంచి కాపాడాలని ఆయన సీఎంకు విన్నవించారు. ఈ వీడియోపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ప్రతి ఏడాది రోడ్లు చెడిపోతుంటాయని, వాటిని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంటుందని సీఎం విజయన్ ఫేస్‌బుక్‌లో తెలిపారు. రోడ్లను బాగుచేసి.. ప్రజలకు మంచి రవాణా అవకాశాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.