'ఇంతకీ ఆ ఫైళ్లలో ఉన్నది రహస్యాలేనా?'
ఇప్పుడు జాతీయ మీడియాతో సహా పలు రాష్ట్రాల మీడియాలో ఒకటే చర్చ. సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన 64 ఫైళ్లలో ఎలాంటి వివరాలు ఉన్నాయో అని. ఈ ఫైళ్ల ద్వారా యావత్ భారత ప్రజానీకానికి నేతాజీ మరణంపై ఉన్న అనుమానాలు నివృత్తి అవుతాయా అంటే మరోసారి ఆలోచించుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ అలా నివృత్తే అయితే.. ఒక్క జాతీయ మీడియానే కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా బెంగాల్ వాకిట్లో వచ్చివాలేది. ప్రభుత్వ పెద్దలు, ఉద్యోగస్తులు, విద్యావేత్తల, విద్యార్థుల నుంచి స్వాతంత్ర్య పోరాటం గురించి ప్రత్యక్షంగా తెలిసి ఉన్న సామాన్య ప్రజానీకం కూడా టీవీలకు అతుక్కుపోయి ఉండేంది. ఎందుకంటే నేతాజీ మరణం ఇప్పటికీ ఓ ఆసక్తి.. ఓ మలుపు.. ఓ సంచలనం.. అన్నింటికిమించి ప్రస్తుతం ఓ రహస్యం.
అసలు నేతాజీ ఎలా మరణించారు? దేశంలో చాలా మందిని వేధించే ప్రశ్న ఇదే. దశాబ్దాలుగా ఇది రహస్యంగా ఉండిపోయింది. నేతాజీ మరణానికి ముందు, మరణం తర్వాత పరిణామాలు.... నేతాజీ కుటుంబీకులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాయనే అంశాలు దశాబ్దాలుగా నిగూఢ పత్రాల్లో దాగుండి పోయాయి. నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను బయటపెట్టాలంటూ కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. సమాచార హక్కు చట్టం ద్వారా కూడా చాలా మంది ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. విదేశాలతో సంబంధాలు దెబ్బ తింటాయనే సాకులతో నేతాజీకి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టలేదు.
ఇక జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఒకే రకంగా వ్యవహరించాయి. అధికారంలోకి రాకముందు బోస్ ఫైళ్లను బయటపెట్టాలని డిమాండ్ చేసిన బీజేపీ.. పాలనా పగ్గాలు చేతబట్టగానే మాట మార్చింది. బీజేపీ కూడా మరోసారి అదే పల్లవిని ఎత్తుకుంది. ఈ నేపథ్యంలో... బోస్‌కు సంబంధించిన రహస్య పత్రాలు బయటకు రావడం కష్టమేమో అనుకుంటున్న సమయంలో ఫైర్ బ్రాండ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫైళ్లను బహిర్గతం చేశారు. చెప్పినట్లుగానే కోల్‌కతాలో ఉన్న పోలీస్ మ్యూజియంలో నేతాజీ ఫైళ్లను అందుబాటులో ఉంచారు. అయితే, వాటికి నిజంగా రహస్యపత్రాలనే గుర్తింపు ఇవ్వొచ్చా అనే విషయం మాత్రం ఆ దస్త్రాల్లో ఏముందనే విషయం తెలిస్తే తప్ప నిర్ణయానికి రాలేము.
ఇంతకీ నేతాజీ ఎప్పుడు మరణించారు..? తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలోనే బోస్ మరణించారనే వార్త నిజమేనా..? 1947 తర్వాత కూడా బోస్ బతికే ఉన్నారా? ఇవన్నీ ప్రజలను వేధించే ప్రశ్నలే. తైవాన్ ప్రమాదంలో బోస్ చనిపోలేదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆయన బతికే ఉన్నారనే వాదన బలంగా ఉంది. 1964 వరకు బోస్ బతికే ఉన్నారని, మారువేషంలో సంచరిస్తూ దేశంలోకి అడుగుపెట్టారని బోస్ మద్ధతుదారులు చెప్పేమాట. ఈ వాదనకు అమెరికా రహస్య పత్రం బలం చేకూరుస్తోంది. జాతి పిత మహాత్మాగాంధీ చనిపోక ముందు కూడా బోస్ మరణ వార్తను నమ్మలేదు. బోస్ చనిపోయారని తాను అనుకోవడం లేదని, ఆయన బతికే ఉన్నారని చెప్పారు. తాను ప్రస్తుతం రష్యాలో ఉన్నానని, భారత్కు రావాలనుకుంటున్నానని ఓ లేఖను కూడా నాడు నెహ్రూకు బోస్ లేఖ రాశారని, ఆ లేఖ గురించి తెలిసిన తర్వాతే గాంధీ మహాత్ముడు ఆయన మరణించలేదని వ్యాఖ్యానించినట్లు కూడా తెలిసింది.
ఇక, నేతాజీకి సంబంధించి1960లో అమెరికా నిఘా వర్గాలు తయారు చేసిన పత్రాల ప్రకారం....1964 ఫిబ్రవరిలో నేతాజీ భారత్‌లోకి అడుగ పెట్టారు. రష్యా నుంచి చైనా మీదుగా ప్రయాణించి భారత్ చేరుకున్నారని ఆ పత్రాల్లో పేర్కొన్నారు. ఆ సమయానికి నేతాజీ 67 ఏళ్ల వయసు ఉంటుందని నిఘా వర్గాల అంచనా. ఈ వివరాలు కూడా బెంగాల్ సర్కారు విడుదల చేసిన పత్రాల్లో ఉంటాయని తెలుస్తోంది. నేతాజీ ఫైళ్ల బహిర్గతంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉద్వేగంగా స్పందించారు. ఇది చారిత్రక ఘట్టమని ఆమె అభివర్ణించారు