నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు!
కుటుంబ సభ్యుల నమ్మకం
* వారిపై భారత ప్రభుత్వం నిఘా.. నేతాజీ రహస్య ఫైళ్ల బహిర్గతంతో వెలుగులోకి
* ఫైళ్లను బయటపెట్టిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం..
కోల్‌కతా: సాయుధ పోరాటంతో బ్రిటిష్ వలసపాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోలేదా? ఆ ఏడాది తర్వాత కొన్నేళ్లు ఆయన జీవించే ఉన్నాడా? ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ప్రశ్నలకు నేతాజీ రహస్య ఫైళ్లు అవుననే జవాబు చెబుతున్నాయి!
నేతాజీ ‘అదృశ్యం’ తర్వాత ఆయన కుటుంబ సభ్యులపై భారత ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలూ నిజమేనంటున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నేతాజీకి సంబంధించిన 64 రహస్య ఫైళ్లను శుక్రవారం బహిర్గతం చేసింది. వాటిలోని వివరాల ప్రకారం..
* నేతాజీ 1945 తర్వాత బతికే ఉన్నట్లు ఆయన అన్న శరత్‌చంద్ర బోస్ కొడుకు ఎస్‌కే బోస్ రాసిన ఉత్తరం ఓ ఫైల్లో ఉంది. ఆయన 1949 డిసెంబర్ 12న లండన్ నుంచి కోల్‌కతాలోని తన తండ్రికి రాసిన లేఖలో ఈమేరకు పేర్కొన్నారు. ‘నేతాజీ రేడియోలో మాట్లాడనున్నట్లు నాకు సమాచారం అందింది. ఆయన ఎప్పుడు మాట్లాడతారో పెకింగ్ రేడియో తెలిపింది. హాంకాంగ్ ఆఫీసు ఆ ప్రసంగాన్ని వినడానికి ప్రయత్నించింది కానీ, ఏమీ వినపడలేదు’ అని రాశారు. ప్రభుత్వ ఆదేశాలపై ఈ లేఖను కోల్‌కతా పోలీసు నిఘా వర్గాలు మధ్యలో అడ్డుకున్నాయి.
* శరత్ బోస్‌కు స్విట్జర్లాండ్ పాత్రికేయురాలు లిల్లీ అబెగ్ 1949 నవంబర్ 1రాసిన లేఖలో ‘సుభాష్ పెకింగ్‌లో ఉన్నట్లు యునెటైడ్ ప్రెస్ తెలిపింది’ అని తెలిపారు. శరత్ అదే ఏడాది డిసెంబర్ 28న అబెగ్‌కు రాసిన లేఖలో.. ‘నా సోదరుడు(సుభాష్) జీవించే ఉన్నట్లు మీకు 1946లో జపాన్ వర్గాలు చెప్పి ఉంటే నా నమ్మకం మరింత బలపడినట్లే’ అని పేర్కొన్నారు. శరత్ రాసిన, అందుకున్న ఉత్తరాలను ఆయన నివసించిన కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్డు పోస్టాఫీసులో, నగరంలోని జనరల్ పోస్టాఫీసులో అడ్డుకుని తనిఖీ చేశారు.
* ఫైళ్లను పరిశీలించిన నేతాజీ కుటుంబ సభ్యుడు చంద్రబోస్ తెలిపిన ప్రకారం.. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన ఫైల్లో కవరు మాత్రమే ఉంది. అందులో పత్రాలు గల్లంతయ్యాయి.కేంద్రం దగ్గరి ఫైళ్లనూ బయటపెట్టాలి: మమత
నేతాజీకి సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసు విభాగం, ప్రభుత్వ లాకర్లలో ఉన్న 64 రహస్య ఫైళ్లను శుక్రవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా పోలీస్ మ్యూజియంలో బహిర్గతం చేశారు. 12,744 పేజీలున్న ఈ ఫైళ్లను నేతాజీ కుటుంబ సభ్యుల సమక్షంలో బయటపెట్టారు. ఫైళ్ల డీవీడీలను నగర పోలీస్ కమిషనర్ ఎస్‌కే పురకాయస్థ నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేశారు. నేతాజీకి సంబంధించి కేంద్ర వద్ద ఉన్న ఫైళ్లనూ బయటపెట్టాలని మమత డిమాండ్ చేశారు.
నేతాజీ కుటుంబ సభ్యులూ ఈ డిమాండ్ చేశారు. ఫైళ్ల బహిర్గతం వల్ల విదేశాలతో సంబంధాలు దెబ్బతినవా అని మమతను విలేకర్లు అడగ్గా, మనది స్వతంత్ర దేశం అని అన్నారు. తర్వాత ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘ఇది చారిత్రకదినం. కేంద్రం వద్ద కూడా 130 ఫైళ్లు ఉన్నాయి. వాటిని బయటపెడితే నిజం తెలుస్తుంది. నిజాన్ని తొక్కిపెట్టలేరు’ అని అన్నారు.
ప్రస్తుతం మ్యూజియంలో ప్రదర్శిస్తున్న ఫైళ్లను సోమవారం ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. కాగా, తమ కుటుంబంపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందని నేతాజీ కుటుంబసభ్యుడు చంద్రబోస్ ప్రశ్నించారు. తన తండ్రి అమియ నాథ్ బోస్‌పై నిఘా కోసం 14 మంది అధికారులను నియమించినట్లు ఓ ఫైల్లో ఉందన్నారు. నేతాజీ సన్నిహితులై నకాంగ్రెస్ నేతలపై, నేతాజీ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ అధికారులపైనా నిఘా ఉంచారన్నారు. మరోపక్క.. తమ వద్ద ఉన్న ఫైళ్లను ఎప్పుడు బయటపెడతామో చెప్పడం కష్టమని కేంద్రం పేర్కొంది.