
గాయాలతోనే చనిపోయారు!
* నేతాజీ మృతిపై తాజా పత్రాల వెల్లడి
* ఐదుగురు సాక్షుల కథనాలు
* స్వతంత్ర పోరాటాన్ని సాగించాలని బోస్ చివరి సందేశం
లండన్: స్వాతంత్య్ర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో అయిన గాయాలతోనే మృతిచెందినట్లు తాజాగా వెల్లడైన పత్రాలు చెబుతున్నాయి. ఆయన సన్నిహితుడు సహా ఐదుగురు సాక్షులు చెప్పిన వివరాలు దీన్ని ధ్రువీకరిస్తున్నట్టు పత్రాల ద్వారా తెలుస్తోంది. బోస్ మిస్టరీ ఛేదించేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ బోస్‌ఫైల్స్.ఇన్ఫో వీటిని బయటపెట్టింది. నేతాజీ సన్నిహితుడు కల్నల్ హబీబుర్ రెమ్మాన్ ఖాన్, ఇద్దరు జపాన్ డాక్టర్లు, ఒక దుబాసీ, ఒక తైవాన్ నర్సు సాక్ష్యాలు వీటిలో ఉన్నాయి.
నేతాజీ తైపీలో 1945 ఆగస్టు 18వ తేదీన జరిగిన విమాన ప్రమాదం తర్వాత అదే రోజు నగర శివారులోని ఆస్పత్రిలో చనిపోయినట్లు ఇవి చెబుతున్నాయి. వీటి మధ్య తేడాలు కూడా లేవు.
కడదాకా పోరాడాను.. ప్రమాదంలో నేతాజీతోపాటు గాయపడిన ఆయన సహచరుడు హబీబుర్.. ప్రమాదం జరిగాక ఆరు రోజుల తర్వాత సాక్ష్యం ఇచ్చారు. అంతిమ క్షణాల్లో బోస్ ఇచ్చిన సందేశాన్ని తెలిపారు. ‘‘తను చనిపోతున్నానని బోస్ నాతో చెప్పారు. దేశప్రజలకు తన సందేశాన్ని అందివ్వమన్నారు. ‘భారత స్వాతంత్య్రం కోసం కడదాకా పోరాడాను. అందుకోసమే ఇప్పుడు ప్రాణత్యాగం చేస్తున్నాను. దేశప్రజలారా! స్వాతంత్య్ర పోరు కొనసాగించండి. త్వరలోనే భారత్‌కు స్వాతంత్య్రం వస్తుంది. ఆజాద్ హింద్ వర్ధిల్లాలి’ అని సందేశమిచ్చారు’’ అని వెల్లడించారు.
చనిపోయారని టెలిగ్రాం.. 1945 సెప్టెంబర్‌లో జేజీ ఫిగెస్ తదితర నిఘా అధికారులతో కూడిన రెండు భారత బృందాలు బ్యాంకాక్, సైగాన్, తైపీ వెళ్లాయి. బోస్ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు ధ్రువీకరించాయి. ‘టీ(నేతాజీ) టోక్యో వెళ్తుండగా ఆగస్టు 18న మధ్యాహ్నం 2 గంటలకు విమాన ప్రమాదం జరిగింది. ఆయన గాయాలతో ఆ రోజు అర్ధరాత్రి చనిపోయారు’ అని 1945 ఆగస్టు 20వ తేదీతో వచ్చిన టెలిగ్రామ్‌ను ఆ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. బోస్ నెలకొల్పిన ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియాతో సంప్రదింపుల కోసం జపాన్ ఆర్మీ తను ఏర్పాటు చేసిన సంస్థ(హికారీ కికాన్)కు దీన్ని పంపింది.
బ్రిటన్ అధికారి ఫిగెస్.. 1946 మే-జూలైల మధ్య టోక్యోలో ఆరుగురు జపాన్ అధికారులను విచారించారు. ప్రమాదం తర్వాత నాన్మోన్ సైనిక ఆస్పత్రిలో నేతాజీ చికిత్స పొందుతున్నప్పుడు అక్కడున్న డాక్టర్ సురుటా తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రంతా నా పక్కనే కూర్చుంటారా అని బోస్.. సురుటాను అడిగారు. అయితే రాత్రి 7 గంటలకు ఆరోగ్యం క్షీణించింది. ఆర్మీ డాక్టర్, ఆస్పత్రి అధికారి యోషిమి మళ్లీ ఒక కర్పూర ఇంజెక్షన్ ఇచ్చారు. బోస్ కోమాలోకి వెళ్లి చనిపోయారు. నేతాజీకి చికిత్స అందించిన సాన్ పీ షా అనే నర్సు కూడా 1946లో ముంబై నుంచి వెళ్లిన హరీన్ షా అనే జర్నలిస్టుకు ఈ వివరాలు చెప్పింది.
‘బోస్ స్పృహలోకి వచ్చినప్పుడల్లా దాహం అనే వారు. కాస్త మూలుగుతూ నీరు కావాలనేవారు’ అని తెలిపింది. ఆస్పత్రి వార్డులలో నైరుతి మూలకు తీసుకెళ్లి బోస్ అక్కడే చనిపోయారంది. యోషిమి1946లో నేతాజీ మరణంపై బ్రిటిష్ అధికారులకు సాక్ష్యమిచ్చారు. ‘బోస్ గాయాలను నూనెలతో శుభ్రం చేశాను. ఒళ్లంతా తీవ్రగాయాలతో, తలపై అత్యంత తీవ్రగాయాలతో బాధపడ్డారు. తలపై గుర్తుపట్టడానికేమీ లేదు. నకమురా అనే దుబాసీని పిలిపించాం. తను బోస్‌తో చాలాసార్లు మాట్లాడానని నకమురా చెప్పారు. తర్వాత(ఆస్పత్రిలో చేరిన4 గంటల తర్వాత) బోస్ అపస్మారకంలోకి పోతున్నట్లు కనిపించింది.
ఆయన కోమాలో ఏదో గొణుక్కున్నారు. కానీ స్పృహ రాలేదు. రాత్రి 11 గంటలకు చనిపోయారు’ అని యోషిమి తెలిపారు. ఆయన 1956లో నేతాజీ విచారణ కమిటీ ముందు, 1974లో ఖోస్లా కమిటీ ముందూ హాజరయ్యారు. ఆయన 1995లో బోస్‌ఫైల్స్.ఇన్ఫో బెబ్‌సైట్ వ్యవస్థాపకుడైన ఆశిష్ రేకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ననోమియా అనే సైన్యాధికారి.. బోస్ ముఖ్యమైన వ్యక్తి.
ఏమైనా సరే బతికించాలి అని నాతో చెప్పారు. అందువల్లే బోస్ ఎవరో నాకు తెలిసింది’ అని వెల్లడించారు. ‘నా తలలోకి రక్తం పోటెత్తుతోంది. కాసేపు నిద్రపోతా’ అని నేతాజీ చెప్పారన్నారు. నకమురా విచారణ కమిటీ ముందు సాక్ష్యమిస్తూ.. ‘నేతాజీ నోట్లోంచి నొప్పి మాటే వినిపించలేదు. ఆయన నిబ్బరం చూసి ఆశ్చర్యపోయాం. నేతాజీ చనిపోయాక గదిలోని జపాన్ అధికారులు వరుసగా నిల్చుని ఆయన భౌతికకాయానికి వందనం చేశారు’ అని తెలిపారు.
రష్యా కోణంలో దర్యాప్తు జరపాలి: మమతా బెనర్జీ
కోల్‌కతా: నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు తాను నమ్మడం లేదని, ఆయన అదృశ్యం వెనక రష్యా కోణంలో దర్యాప్తు జరిపించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఆయనకు సంబంధించిన ఫైళ్లు రష్యాలో చాలా ఉన్నాయని వెల్లడించారు. మహాత్ముడు జాతిపిత అయితే నేతాజీ జాతి నేత అని శనివారమిక్కడ అన్నారు.