
జైట్లీ ట్వీట్ తో షాక్ కు గురయ్యా:మమతా బెనర్జీ
కోల్ కతా: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై ట్వీటర్ లో చేసిన కామెంట్స్ వల్ల షాక్ కు గురయ్యానని పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. ఇది బాధించే ట్వీట్ అని ఆమె పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ శౌర్యానికి ప్రతీక అని, ఆయన వర్థంతి సందర్భంగా నివాళి అర్పించాలని జైట్లీ ట్వీట్ చేశారు.
నేతాజీ 1945లో విమాన ప్రమాదంలో మరణించలేదని భావిస్తున్నవారి మనోభావాలను జైట్లీ గాయపరిచారని మమత పేర్కొన్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన నేతాజీ మనువడు సైతం జైట్లీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జైట్లీ ట్వీట్ పై స్పందించిన మమత రక్షా బంధన్ సందర్భంగా ఎవరినీ బాధ పెట్టే ఉద్దేశ్యం తనకు లేదని కానీ జైట్లీ ట్వీట్ తో చాలా బాధపడ్డామని ట్వీటర్ లో కామెంట్ చేశారు. నేతాజీ మరణం ఇప్పటికీ బెంగాళ్ లో సున్నితమైన అంశంగా ఉంది. ప్రభుత్వాలు నియమించిన విచారణ కమిటీలు సైతం భిన్నమైన రిపోర్టులను ఇచ్చాయి.