సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్టయినా జాతీయ పార్టీల నాయకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఎలాగైనా వారితో మాట్లాడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు లాబీయింగ్ చేసి మరీ స్పందించాలని కోరడంతోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్, అకాలీదళ్ నేత సుఖబీర్‌సింగ్ బాదల్ స్పందించినట్టు తెలుస్తోంది.
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు అరెస్టయి నాలుగురోజులైనా ఆయనకు జాతీయ స్థాయిలో కనీసమద్దతు లభించలేదు. ఎవరూ స్పందించకపోవడంతో పలువురు టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఢిల్లీ స్థాయిలో జాతీయ పార్టీల నేతలతో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు అనుయాయుడు కంభంపాటి రామ్మోహనరావు ఢిల్లీలో తనకు తెలిసిన వారందరినీ కలిసి చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడాలని కోరుతున్నట్టు తెలిసింది.
తనకు తెలిసిన ఎంపీల ద్వారా మమతా బెనర్జీని బతిమలాడటంతో ఆమె మొక్కుబడిగా స్పందించారు. అఖిలేశ్‌ను కూడా టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో ఆయన ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. సుఖబీర్‌సింగ్ బాదల్ కూడా లాబీయింగ్ వల్లే మూడురోజుల తర్వాత స్పందించారు.
పట్టించుకోని జాతీయ పార్టీలు
వివిధ జాతీయపార్టీలు, నేతలతో చంద్రబాబుకు సంబంధాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా జాతీయ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. జాతీయ రాజకీయాలను ఎప్పుడూ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు, అవకాశవాదం కోసం ఉపయోగించడంతో ఆయన నమ్మదగని నేతగా ముద్రపడ్డారు.
ప్రస్తుతం అన్ని పార్టీలు ఆయన్ను దూరం పెట్టాయి. అటు ఎన్డీయే దగ్గరకు రానీయడం లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు. ఏ కూటమిని అయినా తన రాజకీయ అవసరాల కోసమే వాడుకోవడంతో ఇప్పుడు ఆయన దేశ రాజకీయాల్లో ఏకాకిగా మారిపోయారనే వాదన వినిపిస్తోంది.
మద్దతు కోసం ఢిల్లీలో లాబీయింగ్
చంద్రబాబు అనుయాయుడు కంభంపాటి, బీజేపీలోని ఆయన కోవర్టులు సీఎం రమేష్, సుజనాచౌదరి వంటి నేతలు చంద్రబాబుకు అనుకూలంగా లాబీయింగ్‌కు దిగారు. అయినా ఆశించినస్థాయిలో జాతీయనేతలు చంద్రబాబుకు మద్దతు పలకలేదు. కనీసం మరికొంత మందితో అయినా ట్వీట్లు చేయించాలనే ఉద్దేశంతో ఢిల్లీలో తంటాలు పడుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment