
మొహర్రం నాడు నిమజ్జనానికి నో!
ఒకేరోజున దుర్గామాత నిమజ్జనం, మొహర్రం రావడంతో..
మమత సర్కారు నిర్ణయం.. మండిపడుతున్న బీజేపీ
కోల్‌కతా: హిందువులు ఘనంగా నిర్వహించే దుర్గామాత విగ్రహాల నిమజ్జనం, ముస్లింలు భక్తిపూర్వకంగా సంతాపం పాటించే మొహర్రం ఒకేరోజున రావడం పశ్చిమ బెంగాల్‌లో ఉత్కంఠ రేపుతోంది. ఈ రెండు కార్యక్రమాలు ఒకేరోజున రావడంతో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బుధవారం దుర్గాపూజ నిర్వాహకులు, ముస్లిం మతపెద్దలు, ఇతర మతాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ రెండు వేడుకలు ఒకేరోజున ఉన్న నేపథ్యంలో మతసామరస్యాన్ని పాటించే దిశగా వ్యవహరించాలని ఆమె కోరారు. దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సెప్టెంబర్ 30వ తేదీన ప్రారంభం అవుతుందని, అయితే, అక్టోబర్ 1న మొహర్రం దృష్ట్యా ఆ రోజు విగ్రహాల నిమజ్జనానికి అనుమతించబోమని, అక్టోబర్ 2వ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు యథాతథంగా నిమజ్జనం సాగుతుందని ఆమె ఈ సమావేశంలో స్పష్టం చేశారు.
మత ఉద్రిక్తతలు, ఘర్షణలు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే అక్టోబర్ 1న దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి అనుమతించడం లేదని పేర్కొన్నారు. విగ్రహాల నిమజ్జనం, మొహర్రం ఊరేగింపులు ఎదురుపడితే.. అవాంఛనీయ ఘటనలు జరుగుతాయనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే, మమత నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ద్వారా హిందు, ముస్లింలను విడగొట్టడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి మమత సర్కారు ప్రయత్నిస్తున్నదని మండిపడింది. ముస్లింలను సంతృప్తి పరిచేందుకే మమత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించింది.