
కుక్క మాంసం వండలేదని చిత్రహింసలు..
లక్నో: ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా నగరంలోని గామా 1 సెక్టర్లో మై స్పైస్ కేఫ్ హోటల్లో దారుణం చోటు చేసుకుంది. కుక్క మాంసాన్ని వండేందుకు నిరాకరించిన ముగ్గురు చిన్నారులను హోటల్ యజమాని అవినాశ్ కుమార్ చిత్ర హింసలకు గురి చేశాడు. దాంతో స్థానికులు గురువారం అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు హోటల్పై దాడి చేసి... ఐదు కుక్కలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు చిన్నారులను చిల్డ్రన్స్ హోమ్కు తరలించారు. ఈ చిన్నారులు మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు వయస్సు గల వారని... వారిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం... మై స్సైస్ కేఫ్ హోటల్లో చిన్నారులు పని చేస్తున్నారు. వారిపై తరచుగా అవినాష్ దాడి చేసేవాడు. దాంతో వారు బిగ్గరగా ఏడుస్తుంటే హోటల్ ఎదురుగా ఉన్న ప్రవీణ్ బట్టి అనే వ్యక్తి అవినాష్ను ప్రశ్నిస్తే... ఏవేవో కథలు చెప్పేవాడు. అయితే గురువారం ఆర్థరాత్రి చిన్నారులు బిగ్గరగా ఏడవడంతో ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు హోటల్పై దాడి చేసి పిల్లలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుక్క మాంసం వండకపోతే అవినాష్ తమను బండబూతులు తిడుతూ.... విపరీతంగా కొట్టేవాడని.. కరెంట్ షాక్ ఇస్తానని తరచు బెదిరించేవాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా చిన్నారుల శరీరంపై గాయాలను కూడా పోలీసులు గుర్తించారు. హోటల్ మరో భాగస్వామి ముఖేష్ రాజ్పుత్ పరారీలో ఉన్నాడని తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ చిన్నారులను జార్ఖండ్లో ఎనిమిది నెలల కిత్రం కొనుగోలు చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. రెస్టారెంట్ నుంచి ఐదు కుక్కలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. స్థానికంగా నైజీరియన్లు నివసిస్తున్నారు. వారికోసం కుక్క మాంసం వండిస్తున్నట్లు విచారణలో అవినాశ్ చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు.