తాను ప్రభుత్వాధికారినని చెప్పుకొని, బాలికలకు సంబంధించిన పథకం అమలు చేయడానికి వచ్చానంటూ ఓ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఢిల్లీ కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. ఇది చాలా క్రూరమైన చర్య అని కోర్టు వ్యాఖ్యానించింది. అతడిపట్ల జాలి చూపించేందుకు నిరాకరించింది. గతంలో అతడు ఇలాంటి కేసులోనే అరెస్టయ్యి, బెయిల్ మీద విడుదలైన తర్వాత ఎనిమిదేళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడని.. ఇది అత్యంత దారుణమని తెలిపింది. అన్వర్ ఉల్ హక్ అనే ఈ దోషి ఇద్దరు కుమార్తెల తండ్రి అయినా.. ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండటం ఏమాత్రం క్షమార్హం కాదని అదనపు సెషన్స్ జడ్జి ఇలా రావత్ అన్నారు.
అతడికి జీవిత ఖైదుతో పాటు 11 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. బాధితురాలికి 2 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని, ఆమెకు పునరావాసం కల్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2010 జూన్ నెలలో అన్వర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన పేరు ఇమ్రాన్ అని చెప్పుకొని, లాడ్లీ యోజన అనే పథకం కింద దుస్తులు, డబ్బులు ఇస్తారని, ఆ ఫారం తీసుకోడానికి వచ్చానని చిన్నారి తల్లికి చెప్పాడు. ఆమెకు ప్రభుత్వ ఫొటో స్టూడియోలో ఫొటో తీయించాలని చెప్పి అక్కడినుంచి తీసుకెళ్లిపోయాడు. ఓ పార్కుకు తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారం చేసి, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. పాప తిరిగి రాకపోయేసరికి అతడు కిడ్నాప్ చేసి ఉంటాడని తల్లిదండ్రులు అనుమానించారు. మర్నాడు ఓ ఆలయం దగ్గర కనిపించిన చిన్నారి.. జరిగిన విషయాన్ని వారికి చెప్పింది.
బాలికపై అత్యాచారం.. జీవితఖైదు
Published Wed, Feb 26 2014 4:35 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement