దాదాపు కోటి రూపాయల విలువైన బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొస్తున్న ఓ వ్యక్తిని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
దాదాపు కోటి రూపాయల విలువైన బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొస్తున్న ఓ వ్యక్తిని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కర్ణాటకలోని అలీపూర్ ప్రాంతానికి చెందిన నిందితుడు బ్యాంకాక్ నుంచి వస్తుండగా కస్టమ్స్ అధికారులు అతడిని పట్టుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అతడి చేతిలో ఉన్న లగేజిలో బంగారు కడ్డీలు దొరికాయి.
నాలుగు బంగారు కడ్డీలను తెల్లటి టేపుతో చుట్టారు. అవి ఒక్కొక్కటి కిలో చొప్పున బరువున్నాయి. వీటి విలువ రూ. 1.04 కోట్లు ఉంటుందని కస్టమ్స్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అతడిని అరెస్టు చేసి మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సింగపూర్ వెళ్లే విమానం ఎక్కాల్సి ఉందని అధికారులు చెప్పారు. అతడిని డిసెంబర్ నాలుగో తేదీ వరకు కస్టడీపై తీహార్ జైలుకు పంపారు.