మిస్టర్ పోలీస్.. యు ఆర్ అండర్ అరెస్ట్!
ఓ వ్యక్తి మళయాళం సినిమాలో పోలీసు పాత్ర పోషిస్తున్నాడు. లాఠీని చేతుల్లో పట్టుకుని.. మంచి సీరియస్గా డైలాగులు చెబుతున్నాడు. అంతలో అక్కడకు నిజం పోలీసులు వచ్చారు. ''మిస్టర్ పోలీస్, యు ఆర్ అండర్ అరెస్ట్'' అంటూ అతగాడి డైలాగులు తామే చెప్పి, అతడిని లాక్కెళ్లి జీపులో వేసుకుని తీసుకెళ్లిపోయారు. అదేంటని అంతా అవాక్కయ్యారు. విషయం ఏమిటంటో ఓ దాడి కేసులో ప్రధాన నిందితుడైన సంతోష్ అనే ఆ వ్యక్తి గత తొమ్మిదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు.
2006 సంవత్సరంలో కుమారపురం ప్రాంతంలో 15 ఏళ్ల కుర్రాడిపై అతడు దాడి చేశాడు. ఓ కత్తి, ఐరన్ రాడ్తో కుర్రాడిని చంపేందుకు కూడా అతడు ప్రయత్నించాడు. తర్వాత మళయాళ సినీ పరిశ్రమలో చేరిన అతడు.. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చాడు. రాష్ట్ర సచివాలయంలో సినిమా షూటింగ్ జరుగుతుండగా, అక్కడే ఉన్న పోలీసులు తమ పాత నేరస్థుడు పోలీసు దుస్తుల్లో ఉన్నా కూడా గుర్తించి.. వెంటనే వచ్చి అతగాడిని అదుపులోకి తీసుకున్నారు.