సుష్మాజీ.. నా కారులో పొగ ఎక్కువైంది!
విదేశాల్లో తమవాళ్లు చిక్కుకుపోయారనో, ఫారిన్ ట్రిప్‌లో ఉండగా పాస్‌పోర్టు పోయిందనో చెబితే వెంటనే ఆ సమస్యను పరిష్కరించడానికి ఎవరున్నారంటే.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గుర్తుకొస్తారు. ఆమెకు ట్వీట్ చేస్తే చాలు, సమస్యలు పరిష్కారం అయిపోతాయన్న ధైర్యం చాలామందికి ఉంది. అయితే, సమస్య ఎలాంటిదైనా కూడా ఆమెకే ట్వీట్ చేయాలన్న ఆలోచన కొందరికి ఎందుకు వస్తుందో మాత్రం అర్థం కాదు. కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తి తన ఫ్రిజ్ పనిచేయడం లేదని చెబితే.. తాజాగా ఓ వ్యక్తి తన కారు గురించిన సమస్యను సుష్మాకు ట్వీట్ చేశాడు.
తన కొత్త కారు ఫొటోలను కూడా పోస్ట్ చేసిన సదరు వ్యక్తి.. తన సమస్యను వివరించాడు. తాను కొత్తగా కొన్న ఫోక్స్‌వాగన్ జెట్టా కారు నుంచి విపరీతంగా తెల్లటి పొగ వస్తోందని, దాన్ని ఏం చేయాలో తెలియట్లేదని అతగాడు అన్నాడు. తర్వాత దానికి ఆమె సమాధానం కూడా ఇచ్చారు. ''అయాం సారీ, మీ కారును వర్క్‌షాపునకు తీసుకెళ్లంది'' అని ఆమె చెప్పారు. ట్విట్టర్ జనాలు చాలామంది ఆమె సమాధానాన్ని మెచ్చుకున్నారు. పని పాట లేనివాళ్లంతా ఏది పడితే అది ట్వీట్ చేసి, దానికి సుష్మా స్వరాజ్ సమాధానం చెప్పాలంటే ఎలాగని ప్రశ్నలు గుప్పించారు. సుష్మా ట్వీట్‌ను చాలామంది రీట్వీట్ చేయగా కొన్ని వేల మంది దాన్ని లైక్ చేశారు.