‘టీ’ ఇస్తాం.. సోదరుల్లా మెలగండి | manmohan singh hopes parliament passes Telangana bill | Sakshi
Sakshi News home page

‘టీ’ ఇస్తాం.. సోదరుల్లా మెలగండి

Published Wed, Feb 5 2014 2:22 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

‘టీ’ ఇస్తాం.. సోదరుల్లా మెలగండి - Sakshi

‘టీ’ ఇస్తాం.. సోదరుల్లా మెలగండి

కేసీఆర్ బృందంతో ప్రధానమంత్రి మన్మోహన్
 
 సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్న తమ వాగ్దానానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మన్మోహన్‌సింగ్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధినేత కె.చంద్రశేఖర్‌రావు బృందానికి హామీ ఇచ్చారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇరు ప్రాంతాల ప్రజలు సోదరభావంతో మెలగాలని ఆకాంక్షించారు. మనమంతా భారతీయులమనే భావనను మదిలో పెట్టుకోవాలని సూచించారు.
 
 మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో టీఆర్‌ఎస్ బృందం ప్రధాని అధికార నివాసంలో ఆయనతో భేటీ అయ్యింది. పది నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ముందుగా పార్టీ తరఫున బిల్లులో చేయాల్సిన సవరణలను వివరిస్తూ కేసీఆర్ ఆరు పేజీల వినతిపత్రాన్ని అందించారు. తొమ్మిది అంశాలపై సవరణలు కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకొని రాష్ట్ర ఏర్పాటుకు ముందుకొచ్చిన మీ ప్రభుత్వానికి నాలుగు కోట్ల ప్రజల నుంచి కృతజ్ఞతలు. బిల్లు ఎప్పుడు ఆమోదం పొందుతుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్‌లో ఎలాంటి అడ్డంకులు రాకుండా సంపూర్ణ తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతున్నాం. ఇందుకోసం కొన్ని సవరణలు చేస్తున్నాం. వాటిని పరిగణనలోకి తీసుకొని మా ఆకాంక్షను నెరవేర్చండి’ అని కోరారు. ముఖ్యంగా హైదరాబాద్ శాంతిభద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడాన్ని కేసీఆర్ ఎత్తిచూపారు. ఏ రాష్ట్రానికీ లేనివిధంగా తెలంగాణ రాజధాని శాంతిభద్రతలను గవర్నర్‌కు కట్టబెట్టడం సమంజసం కాదని తెలిపారు. నీళ్లు, నిధులు నియామకాలు వంటి వాటిలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించాలని కోరారు. మరిన్ని అంశాలనూ ఆయన ప్రధాని వద్ద ప్రస్తావించారు. అవి..
 
 ఏపీ భవన్ మాదే
 
 ఢిల్లీలోని ఏపీ భవన్, హైదరాబాద్ హౌస్, అనుబంధ భూములు, భవనాలు నిజాం పాలన నాటి ఆస్తులు. అవి తెలంగాణ ప్రజలకు సంబంధించనవి. హైదరాబాద్ రాష్ట్రం ఏపీలో విలీనమయ్యాక ఈ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వీటిని తెలంగాణకు ఇవ్వాలి.
 
 హైకోర్టులు వేర్వేరుగా ఉండాలి
 
 ప్రస్తుతం హైకోర్టులోని 37 మంది జిల్లా జడ్జీల్లో తెలంగాణకు చెందిన వారు ఏడుగురే ఉన్నారు. మిగతా సిబ్బందిలోనూ 80 శాతం ఆంధ్రా వారే. అందువల్ల తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఉండాలి. రెండు హైకోర్టులను ఏర్పాటు చేయడానికి మిగతా రాష్ట్రాల్లో తీసుకున్న చర్యలను అనుసరించాలి.
 
 విద్యుత్తు
 ఏ ప్రాంతంలో ఉన్న విద్యుత్ ప్లాంటు నుంచి ఉత్పత్తయ్యే కరెంటు ఆ ప్రాంతానికే చెందాలి. కొత్త విద్యుత్ సంస్థలు(జెన్‌కో, ట్రాన్స్‌కో) ఏర్పాటుకు బిల్లులో అవకాశం కల్పించాలి. హైదరాబాద్‌కు కేంద్రం కోటా నుంచి పదేళ్లపాటు వెయ్యి మెగావాట్ల అదనపు విద్యుత్ ఇవ్వాలి. శంకరపల్లి విద్యుత్ కేంద్రానికి సరిపడినంత గ్యాస్ ఇవ్వాలి. తెలంగాణలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయాలి.
 
 ఆస్తులు, అప్పుల పంపకం
 
 ఆస్తులు, అప్పులను జనాభా దామాషాలో పంచొద్దు. ఏ ప్రాజెక్టు లేదా పథకం కోసం తెచ్చిన అప్పు అది ఉన్న ప్రాంతానికే చెందాలి.
 
 ఉద్యోగులు, పెన్షనర్ల విభజన
 
 స్థానికత ఆధారంగానే ఉద్యోగులు, పెన్షనర్ల విభజన జరగాలి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ వారికి దక్కాల్సిన ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతం వారే కొల్లగొట్టారు. 24 వేల మంది ఉద్యోగులను తిప్పి పంపాలంటూ 1969లో జీవో 36 వచ్చింది. 56,972 మందిని వెనక్కి పంపాలని 1985లో జీవో 610 వచ్చింది. అయినా అవి అమలు కాలేదు. ఆ ఉద్యోగాలను కోల్పోయింది తెలంగాణ ప్రజలే. ఇప్పుడు ఆంధ్ర ఉద్యోగుల పింఛన్లు కూడా భరించాలంటే అదే అన్యాయాన్ని కొనసాగించినట్లవుతుంది. అందుకే స్థానికత ఆధారంగా పింఛన్ల భారాన్ని పంచాలి. హైదరాబాద్‌లో నివాసం ఏర్పరుచుకున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల విషయంలోనూ స్థానికత, ఎక్కువ సేవలు అందించిన ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు విభజన అనంతరం తెలంగాణలో పనిచేసే అవకాశం కల్పించాలి.
 
 ఉన్నత విద్య
 
 సాంకేతిక, ఉన్నత విద్య, వైద్య విద్యలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అడ్మిషన్లలో ఇప్పుడున్న విధానమే కొనసాగాలని బిల్లులో పేర్కొన్నారు. కేంద్ర విద్యాసంస్థల్లో రెండు ప్రాంతాలకూ అవకాశం ఉండాలి. కానీ రాష్ట్రాలకు చెందిన సంస్థల్లో ఆ రాష్ట్ర విద్యార్థులకే అడ్మిషన్లుండాలి. తెలంగాణలో ఐఐఎం, ఎయిమ్స్ కేంద్రాల్ని ఏర్పాటు చేయాలి. కేసీఆర్ చెప్పిన విషయాలను ప్రధాని సావధానంగా విన్నారు. పార్టీ సూచించిన అన్ని సవరణలను పరిగణనలోకి తీసుకుంటామని టీఆర్‌ఎస్ బృందానికి హామీ ఇచ్చారు. విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని, భవిష్యత్‌లో ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా అందరూ భారతీయులమన్న భావనతో మెలగాలని సూచించారు. ప్రధానిని కలిసిన బృందంలో ఎంపీలు మంద జగన్నాథం, వివేక్, మాజీ ఎంపీలు వినోద్, జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, పోచారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఈశ్వర్, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి, నేతలు జగదీశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు.
 
 తెలంగాణ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామన్నారు: కేసీఆర్
 ప్రధానితో భేటీ అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘బిల్లులో చేయాల్సిన సవరణలను ప్రధానికి వివరించాం. వాటిని సానుభూతితో పరిశీలిస్తానని చెప్పారు. ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించడానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని తెలిపారు. ఆయనకు ధన్యవాదాలు. నేను హైదరాబాద్ నుంచి వచ్చే ముందు చెప్పినట్లుగా, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళుతున్నా.. తెలంగాణతో తిరిగొస్తానన్న మాటలు నిజం కాబోతున్నాయి’’ అని అన్నారు.
 
 జైపాల్‌తో కేసీఆర్ మంతనాలు
 ప్రధానితో భేటీ అనంతరం స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన జరిగిన ఫ్లోర్‌లీడర్ల సమావేశానికి కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ బిల్లు ఆమోదం విషయమై అరగంట పాటు చర్చించారు. ప్రధానితో భేటీ వివరాలను జైపాల్‌కు వివరించారు. తెలంగాణకు మొదటి నుంచీ మద్దతిస్తున్న బీజేపీ సైతం పార్లమెంట్‌లో పూర్తి మద్దతు ఇస్తుందని ఇద్దరు నేతలు ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అనంతరం వారు రాజ్యసభ అభ్యర్థుల విజయావకాశాలపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.కేశవరావుకు మద్దతిచ్చేలా అధిష్టానాన్ని ఒప్పించాలని కేసీఆర్ కోరినట్లు తెలిసింది. దీనిపై జైపాల్ ఎలాంటి హామీ ఇచ్చారన్నది తెలియరాలేదు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement